ఆనందయ్య నాటు మందు అధికారులకు, నాయకులకు మాత్రమే పరిమితమైంది. క్యూలైన్లో గంటల కొద్దీ వేచి ఉన్నా.. సామాన్య ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో.. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో.. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆనందయ్య కరోనా ఔషధం పంపిణీకి ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ముందు రోజు రాత్రి.. రాజకీయ నాయకులు టోకెన్లు ఏర్పాటు చేసి కొందరు స్థానికులకు పంపిణీ చేశారు.
ఈ రోజు ఉదయం నుంచి.. ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే, నాయకులు, అధికారుల సమక్షంలో పంపిణీ సజావుగా ప్రారంభించారు. అయితే ఔషధం కోసం.. ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావడంతో అధికారులు, పోలీసులు తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమై పరిస్థితి అదుపుతప్పింది. ప్రజలంతా గుంపులు గుంపులుగా చేరటంతో గందరగోళం ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన కొందరు పోలీసు సిబ్బంది.. చేతివాటం ప్రదర్శించారు. మరికొందరు పోలీస్ సిబ్బంది.. క్యూలో లేకుండా పలుమార్లు ఔషధం తీసుకున్నారు. ఇదంతా గమనిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు సైతం మౌనంగా ఉండిపోయారు. టోకెన్లతో గంటలకొద్దీ నిలబడి ఉన్న ప్రజలకు నిరాశ, నిరీక్షణ తప్ప ఔషధం లభించలేదు. దీంతో చేసేదేమీ లేక.. వారు వెనుతిరుగుతూ కరోనా మందు అధికారులకేనా..? అంటూ నిరాశతో వెనుదిరిగారు.
ఇదీ చదవండి: