ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నాగన్నపాలెంవాగు వంతెన వద్ద కారు-కంటైనర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భీమవరానికి చెందిన కంటైనర్ డ్రైవర్ వెంకట దుర్గారావు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఒంగోలు రూరల్ సీఐ సుబ్బారావు, సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రొయ్యలు లోడ్ చేసుకునేందుకు కంటైనర్.. ఖాళీ బాక్సులతో సింగరాయకొండ నుంచి భీమవరం బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. కారు చీమకుర్తికి చెందిన పఠాన్ ఖాన్ అనే వ్యక్తిదిగా వివరించారు. పఠాన్.. ఒంగోలు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రీకౌంటింగ్ నిర్వహించాలని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన