Formation of National Investment Preparation Council : ప్రకాశం జిల్లాలో పదేళ్ల క్రితం జాతీయ పెట్టుబడుల తయారీ మండలి ఏర్పాటుకు పచ్చ జెండా ఊపిన కేంద్రం.. ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదు. అదిగో, ఇదిగో పరిశమలు అన్న మాటల తప్ప.. పరిశ్రమలు ఏర్పడింది లేదు.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందీ లేదు. పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయి అని ఆశలు పెట్టుకున్న యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
2012లో కేంద్రం పచ్చజెండా : ప్రకాశం జిల్లాలో నిమ్జ్ ఏర్పాటుకు 2012లో కేంద్రం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ప్రభుత్వం నిమ్జ్ ఏర్పాటుకు జిల్లాలో కనిగిరి ప్రాంతంలోని పామూరు, పిసిపల్లి మండలాల పరిధిలో మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసింది. ఇందులో భాగంగా 14,390 ఎకరాలను గుర్తించారు. బోదవాడలో 3405 ఎకరాలు, మాలకొండ పురంలో 3209 ఎకరాలు, రేణిమడుగులో 1025 ఎకరాలు, సిద్ధవరం 4390 ఎకరాలు, అయ్యన్నకోట 552 ఎకరాలు, పెద్ద ఇర్లపాడు 1647 ఎకరాలు భూములు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ, అసైన్డ్ భూములతో పాటు ప్రైవేటు సాగుభూములు ఉన్నాయి. ఈ భూములను సేకరించి ఆ మేరకు రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది.
3.15లక్షల ఉద్యోగాల అంచనా : మూడు దశల్లో నిమ్జ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా మొదటి విడతలో రూ.3,640 కోట్లతో 4149 ఎకరాల్లో పారిశ్రామికవాడను డెవలప్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3.15 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. అలాగే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు, వాహన విడిభాగాలు, పీవీ పైపులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వుడ్, ఫార్మాటికల్స్, ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, సోలార్ తదితర పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడికి అనువుగా వెలుగొండ జలాశయం గొట్టిపడే కాలువ నుంచి దాదాపు 1.2 టీఎంసీల నీటిని వినియోగించుకోనున్నారు.
గత ప్రభుత్వ హయాంలో భూముల గుర్తింపు రైతులతో సమావేశాలు ఇతర కార్యకలాపాలు నిర్వహించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు విషయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారింది. 2019 ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నిమ్జ్ ఏర్పాటు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మూడు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే త్వరలోనే నిమ్జ్పై ప్రకటన ఉంటుందన్నారు. ఇటీవల ప్రభుత్వం నిమ్జ్ ఏర్పాటు విషయమై దృష్టి సారించిందని కందుకూరు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ వెల్లడించారు. జిల్లా అధికారులు సైతం ఆ ప్రాంతాన్ని తరచూ పరిశీలిస్తున్నారు. ఇలా ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడం, దానికి సంబంధించిన పనుల్లో పురోభివృద్ధి లేకపోవడంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటుకు పబ్లిక్ హియరింగ్ నిర్వహించి కేంద్రానికి నివేదించామని.. అక్కడి నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాల్సి ఉందని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. క్లియరెన్స్ వచ్చిన వెంటనే భూసేకరణ.. మౌలిక వసతుల కల్పన, ఇతర పనులు చేపడతామన్నారు.
ఇవీ చదవండి :