Nara Lokesh Yuvagalam Padayatra in Kanigiri : వర్శిటీలను ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెబుతున్న జగన్ పాలనలో అధ్యాపకులు లేక కళాశాలలు వెలవెల బోతున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్ మండిపడ్డారు. యూనివర్సిటీలకు చెందిన రూ.150 కోట్ల నిధులు పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదన్న లోకేశ్.. సుద్దముక్కలు కూడా దిక్కులేని స్థితిలో విద్యావ్యవస్థలు అల్లాడుతున్నాయన్నారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 160వ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. జోరువానలోనూ భారీ సంఖ్యలో స్థానికులు, కార్యకర్తలు పాల్గొని యువనేతకు మద్దతుగా నడిచారు. ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ పోస్టుల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకొని నడిచిన తనకి అడ్డుకునే దమ్ము ఎవరికైనా ఉందా? అని లోకేశ్ ప్రశ్నించారు.
ఎమ్మెల్యే మధుసూదన్ కాదు.. మనీసూదన్ : జిల్లాలో గతంలో టీడీపీ చేసిన అభివృద్ధిపై గత నాలుగేళ్లుగా వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని లోకేశ్ సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేయలేని అభివృద్ధిని, ప్రత్యేకంగా చేసి చూపిస్తానని జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ పేరు మధుసూదన్ కాదని మనీ సూధన్ అని అన్నారు. మధుసూదన్ నియోజకవర్గంలో రోడ్లు వేయకుండానే రోడ్లు వేసినట్లు చూపించి.. బిల్లులు మింగేశారని ఆరోపించారు. భూ కబ్జాలు భూ దందాలకు పాల్పడుతూ మనీ సూధన్గా మారాడన్నాడు.
జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో ఎకరా పొలాన్ని మూడు లక్షలకు కొనుగోలు చేసి 13 లక్షలకు కొన్నట్లుగా చూపిస్తూ.. అలా 46 ఎకరాలను చూపించి కోట్ల రూపాయలను కాజేశాడని ఆరోపించారు. ఇది కాక నియోజకవర్గంలో సుమారు 100 ఎకరాలలో మట్టి ఇసుక అక్రమంగా తరలిస్తూ కోట్లను దండుకున్నాడని స్థానిక ఎమ్మెల్యేపై లోకేశ్ వ్యంగస్త్రాలు విసిరాడు.
సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే వైఎస్సార్సీపీకి అంతిమ యాత్ర : కనిగిరి సభకి ప్రజలు ఆటోల్లో వస్తుంటే ఒక్కో ఆటోకి 20 వేల ఫైన్ వేసారని, వారిని ఒక్క రూపాయి కట్టొద్దని సూచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దొంగ చలాన్లు అన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. యువగళాన్ని సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర ఇది ఒకప్పటి స్లోగన్ అని.. ఇప్పుడు ఆ స్లోగన్ మార్చామన్నారు. సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే వైఎస్సార్సీపీకి అంతిమ యాత్ర అంటూ లోకేశ్ హెచ్చరించారు.
విజయలక్ష్మి ఫ్యాన్స్ ఫ్లెక్సీ వేయించమంటావా? : తాను చేస్తున్న యువగళం పాదయాత్ర చూసి జగన్ భయపడుతున్నాడని, పాదయాత్రను, సభలను విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడని లోకేశ్ అన్నారు. ఈ కార్యక్రమం లైవ్‌లో వస్తున్నప్పుడు, మరి ఐ ప్యాక్ టీమ్‌ను పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందని.. ప్లెక్సీలు వేయిస్తావా? అంటూ లోకేశ్ తీవ్రంగా విరుచుకు పడ్డారు. జగన్ ఒక దొంగ.. షర్మిలే వైఎస్ నిజమైన వారసురాలు.. ఇట్లు షర్మిల ఫ్యాన్స్ అని, అమ్మకి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకి గాజులు కొంటాడా? ఇట్లు విజయలక్ష్మి ఫ్యాన్స్ అని ఫ్లెక్సీ వేయించమంటావా? అని లోకేశ్ హెచ్చరించారు.