ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం హాజీపురం గ్రామ అటవీ ప్రాంతం నుంచి కుళ్లిన మృతదేహాన్ని రహదారి వరకు మోసుకొచ్చిన మహిళా ఎస్ఐ కృష్ణ పావని.. స్థానికుల మన్ననలు పొందారు. పంచనామా అంత్యక్రియలు కూడా పోలీసులే నిర్వహించడంతో.. పోలీసుల పట్ల ప్రజలకు గౌరవం పెరిగిందని స్థానికులు తెలిపారు. ఆమెను అభినందిస్తూ స్థానికులు ఘనంగా సత్కరించారు.
ఏం జరిగిందంటే? : ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం హాజీపురం గ్రామ అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటాన్ని గ్రామ పశువుల కాపరులు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన కనిగిరి సీఐ పాపారావు, హనుమంతునిపాడు ఎస్ఐ కృష్ణ పావని తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. దుర్వాసన వస్తుండడంతో మృతదేహాన్ని.. దగ్గరగా వెళ్లి చూడడానికి అందరూ ఇబ్బంది పడ్డారు. అలాంటి స్థితిలో.. ఆ మృతదేహాన్ని అటవీ ప్రాంతం నుంచి రహదారి వరకు తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో మహిళా ఎస్ఐ కృష్ణ పావని మరొకరి సాయంతో ఎదురు బొంగుకు మృతదేహాన్ని డోలిలా కట్టి.. సుమారు 5 కిలోమీటర్లు మోసుకొచ్చారు.
ఇదీ చదవండి: కుళ్లిన శవాన్ని భుజాలపైకి ఎత్తుకున్న మహిళా ఎస్ఐ.. అడవిలో 5 కిలోమీటర్ల నడక!