ఎన్నిక .. ప్రతీ ఓటుదీ అమూల్య భూమిక. నా ఒక్కరి ఓటు వల్ల ఒరిగేదెముంది అంటే తప్పులో కాలేసినట్లే. గత ఎన్నికల్లో ఒక్క ఓటుతో సీటు మారిపోయింది.. చాలాచోట్ల స్వల్ప తేడాతో గెలుపు పాఠం .. ఓటమి గుణపాఠాన్ని రుచి చూపించింది. సకల వసతులున్నా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు నాలుగు లక్షలమంది ఓటేయలేదు. 2019లో 3.51 లక్షల మంది ఎన్నికకు దూరంగా ఉన్నారు. అక్షరాస్యత, సౌకర్యాలు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లోనే పోలింగ్ శాతం తక్కువగా ఉండడం ఆవేదనకు గురిచేస్తోంది. కష్టాలతో సహవాసం చేసే గిరిజనులు, మూరుమూల ప్రాంతాల్లో 85 శాతానికిపైగా పోలింగ్ నమోదవుతోంది.
ఒక అంకె ఓటు తేడాతో...
2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో త్రిపురాంతకం మండలం కంకణాలపల్లె పంచాయతీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క ఓటుతో అభ్యర్థి గెలుపొంది సర్పంచి పీఠం దక్కించుకున్నారు.
2013 ఎన్నికల్లో వై.పాలెం మండలం మొగుళ్లపల్లె పంచాయతీలో ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో ఓ వ్యక్తి ప్రథమ పౌరుడిగా అవతరించారు.
2006 పంచాయతీ ఎన్నికల్లో కనిగిరి మండలం పేరంగుడి గ్రామ సర్పంచిగా ఎన్నికైన వ్యక్తికి వచ్చిన ఆధిక్యం ముచ్చటగా మూడు ఓట్లే !
మడుగులో మూడు ఓట్లతో...
కొనకనమిట్ల మండలం వాగుమడుగులో 2013లో జరిగిన ఎన్నికల్లో వెంకటేశ్వర్లు సమీప ప్రత్యర్థిపై 3 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎదురురాళ్లపాడు పంచాయతీలో తిరుపతమ్మ ఆరు ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. రుగుమానపల్లిలో రమణారెడ్డి ఏడు ఓట్లతో గెలుపొంది సర్పంచిగా ఎన్నికయ్యారు.
కోలభీముడు..
మార్కాపురం మండలంలోని కోలభీమునిపాడులో 2001లో జరిగిన ఎన్నికల్లో అంబటి చిన్నరామిరెడ్డి ఆరు ఓట్ల తేడాతో గెలుపొందారు. 2006 ఎన్నికల్లో మీనిగ కోటమ్మ సమీప ప్రత్యర్ధిపై 11 ఓట్ల తేడాతో గెలిచారు. తర్లుపాడు మండలంలోని జగన్నాథపురంలో 2013లో జరిగిన సర్పంచి ఎన్నికల్లో మక్కెన బాలయ్య ప్రత్యర్థిపై 12 ఓట్ల తేడాతో గెలుపొందారు.
తాళ్లూరులో తారుమారు
కేవలం రెండు ఓట్ల తేడాతోనే అదృష్టాలు తారుమారయ్యాయి. 2013లో జరిగిన గ్రామ పంచాయతీల ఎన్నికల్లో తాళ్లూరు మండలంలో ఇద్దరు నారీమణులు కేవలం రెండు ఓట్ల తేడాతో విజయం సాధించి మహిళా సత్తా చాటారు. విఠలాపురం సర్పంచిగా తెదేపా మద్దతుతో పోటీ చేసిన పాలెపోగు విజయకుమారి ఎన్నికయ్యారు. ఆమెకు 735 ఓట్లు రాగా వైకాపా మద్దతుతో పోటీ చేసిన గోళ్లపాటి పద్మకు 733 ఓట్లు వచ్చాయి. మల్కాపురంలో తెదేపా మద్దతుతో పోటీ చేసిన అనపర్తి హెప్సిబా కేవలం రెండు ఓట్ల తేడాతోనే విజయం సాధించారు.
మర్రిపూడిలో ఒక్క ఓటుతో
మర్రిపూడి మండలంలోని జువ్విగుంట పంచాయతీలో 2013లో జరిగిన సర్పంచి ఎన్నికల్లో బొమ్మినేని లక్ష్మమ్మ ప్రత్యర్ధి రావులపల్లి రమణమ్మపై ఒక్క ఓటుతో గెలుపొంది సత్తా చాటారు. మర్రిపూడి మండలంలోని గార్లపేట పంచాయతీలో 2013లో జరిగిన ఎన్నికల్లో ఎ.అచ్చమ్మ సమీప ప్రత్యర్థి బి.చిన్నమ్మపై ఒక్క ఓటుతో విజయం సాధించారు.
ఇవీ చూడండి...: సర్పంచ్ పదవి వేలం అందుకేనా!