Kabaddi Ex Players Athmeeya Sammelanam: సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులనే కాదు.. పాత స్నేహితులను సైతం దగ్గర చేస్తుంది. ఎప్పుడు హడావిడితో ఉరుకుల పరుగుల మధ్య నిత్యం బిజీగా ఉండే వారంతా.. ఒక్క చోట కలుసుకున్నారు. వారి వృత్తిలో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నా.. పండగకు కలిసి వారి గత కాలపు జ్ఞాపకాలను నేమరువేసుకున్నారు. అలా 1972 నుంచి 2023 మధ్య కాలంలో వివిధ స్థాయిల్లో కబడ్డీ క్రీడల్లో ప్రతిభను చూపించిన వారంతా.. ప్రకాశం జిల్లాలో కలిసి తమ తమ వృత్తిలో కష్ట, సుఖాలను పంచుకున్నారు. ఆడిపాడి చిందులేశారు.
వారంతా ఓల్డ్ కబడ్డీ క్రీడాకారులు.. వివిధ స్థాయిల్లో కబడ్డీ ఆటలో రాణించారు. కొందరు క్రీడా కోటాలో ఉద్యోగాలు పొందారు. వివిధ ప్రాంతాలు, రాష్టాల్లో స్థిరపడ్డారు. మరి కొందరు ఇతర రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. 1972 నుంచి 2023 మధ్య కబడ్డీ క్రీడాకారులు, శిక్షకులు, వ్యాయామ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా పూర్వ క్రీడాకారులంతా ఒకచోట చేరారు. ఒంగోలులోని బృందావనం కళ్యాణ మండపంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కుటుంబ సభ్యులతో పాటు పాల్గొని మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. నాటి రోజులను గుర్తుకు చేసుకుంటూ... సాధించిన విజయాలు నెమరు వేసుకుంటూ.. ప్రశంసలు, అభినందనలతో ఆహ్లాదకరమైన వాతావరణం లో గడిపారు. ఇందులో జాతీయ స్థాయిలో రాణించిన కబడ్డీ క్రీడాకారులు, డీఎస్పీ స్థాయి హోదాల్లో ఉన్న ఓల్డ్ క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఏటా ఇలా అందరం కలుసుకుని యోగ క్షేమాలు తెలుసు కోవడం, కుటుంబ సభ్యులు అంతా కలిసి సందడి వాతావరణంలో పూర్వ క్రీడాకారుల సమ్మేళనం చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
'మాది కనిగిరి, మేము జాతీయ స్థాయిలో 1973,74,75... లో కబడ్డీ క్రీడలు ఆడాం. నేను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. మేము నేషనల్స్‌లో రెండు సార్లు పాల్గొన్నాం. మేమంతా ఒక బ్యాచ్‌గా ఉండేవాళ్లం.. ఆ రోజుల్లో మా స్కూల్ నుంచి ఐదుగురం అమ్మాయిలం నేషనల్స్‌కు వెళ్లాం. మమ్మల్ని గుర్తించి ఇలాంటి సన్మానం చేసినందుకు ఆనందంగా ఉంది. ప్రకాశం జిల్లాలో ఉన్న కబడ్డీ క్రీడాకారులను అందరిని ఏకం చేసేందుకు చేసిన ప్రయత్నం మాకు చాలా బాగా నచ్చింది. ఈ అవకాశం కల్పించినందుకు అందరికి కృతజ్ఞతలు.'- దేవి రెడ్డి సరస్వతి, మాజీ కబాడ్డీ క్రీడాకారిణి
ఇవీ చదవండి: