Jagananna Colony in Kanigiri : జగనన్న కాలనీలు చిన్నారుల జలకాలాటలకు అనుకూలంగా మారాయి. ఇలాంటి పరిస్థితి ప్రకాశం జిల్లా కనిగిరి జగనన్న కాలనీలో దర్శనమిస్తోంది. కనిగిరి శివారు ప్రాంతంలో జగనన్న కాలనీ కింద 1207 నివేశన స్థలాలను లబ్ధిదారులకు మంజూరు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జగనన్న కాలనీ లేఅవుట్లో చినుకు పడితే చాలు కాలనీలో ఎక్కడికక్కడ వర్షపు నీళ్లు నిలబడి చిన్నపాటి చెక్ డ్యామ్‌లను తలపిస్తున్నాయి. దీనికితోడు పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో చిన్నారులకు ఈ కాలనీలోని నీటి గుంటలు ఆటవిడుపు కేంద్రాలుగా తయారయ్యాయి. గత మూడు రోజుల కిందట కురిసిన చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ బురదమయమై చిత్తడిగా మారి కనీసం పాదచారులు సైతం నడిచేందుకు వీలు లేకుండా పోయింది.
నిర్మాణ సామగ్రి ఎక్కడిదక్కడే.. ఈ వర్షాల ధాటికి ఓ పక్క నిర్మాణంలో ఉన్న బేస్ మెట్లు కుంగిపోగా.. కుప్పల కుప్పలుగా సిమెంటు బస్తాలు తడిసి గడ్డకట్టి నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇదిలా ఉండగా జగనన్న కాలనీలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నాారు. ఇవన్నీ తమకు పట్టనట్లుగా అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. నిర్మాణాలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుక, నీళ్లు మొదలగు సామగ్రికి నగదు వసూలు చేస్తుండగా.. దానికితోడు సక్రమంగా బిల్లులు రాక సతమతం అవుతున్నామని నిర్మాణదారులు పేర్కొంటున్నారు. విద్యుత్ మోటార్లు మరమ్మతుకు గురై వారం రోజులైనప్పటికీ ఏ అధికారి కన్నెత్తి చూడకపోగా నిర్మాణానికి అవసరమైన నీళ్ల కోసం ఒక్కో ట్యాంకర్ నీళ్లు 500 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టాల్సిన దుస్థితి నెలకొందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జగనన్న కాలనీలోని సౌకర్యాలను మెరుగుపరచి తమని ఆదుకోవాలని కాలనీలోని లబ్ధిదారులు కోరుతున్నారు.
కాలనీలో స్థలం ఇచ్చాం కదా ఇల్లు కట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ, నీళ్ల సమస్య చాలా ఉంది. ప్రభుత్వం పంపించే ట్యాంకర్ వస్తుంది కానీ, రెండ డ్రమ్ముల నీళ్లే ఇస్తున్నారు. అవి ఎటూ చాలడం లేదు. కాలనీలో నీళ్ల మోటార్ కాలిపోయింది కానీ, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇంటి నిర్మాణ ఖర్చు ఇప్పటికే 2 లక్షల రూపాయలు దాటింది. ఇంకో 3 లక్షలు అయితే తప్ప పూర్తయ్యేలా కనిపించడం లేదు. ప్రభుత్వ ఇచ్చింది లక్షా 20 వేలు మాత్రమే. కిటికీలకు కట్ చేశారు. సిమెంటు, కరెంటు సామానుకు కూడా కటింగ్ పెట్టారు. ఇసుక అడిగితే రాదన్నారు.. ఖర్చు ఇప్పటికే 6వేలకు పైగా అయ్యింది. 500 పెట్టి నీళ్ల ట్యాంకర్ తెప్పించుకుంటున్నాం. ఒక్క ఇల్లు కూడా తయారు కాదు. - సుబ్బమ్మ, నిర్మాణదారురాలు, కనిగిరి
ఇవీ చదవండి :