హీమోఫీలియా (రక్తం గడ్డకట్టకపోవడం) బాధితుడి సామాజిక భద్రత పింఛన్‌ను అధికారులు రద్దు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. మెడికల్ ఆఫీసర్ జారీచేసిన ధ్రువపత్రం ఆధారంగా అతను పింఛను పొందుతున్నారని గుర్తుచేసింది. ఆ పత్రాన్ని రద్దు చేయకుండా, ఎలాంటి నోటీసు జారీ చేయకుండా ప్రకాశం జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) ఏకపక్షంగా పింఛను రద్దు చేయడంపై మండిపడింది. డీఎంహెచ్‌వో ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేసింది. ఏ అధికారంతో పింఛను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారో మార్చి 4న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హీమోఫీలియాతో బాధపడుతున్న తనకు గతంలో పింఛను వచ్చేదని, ఏకపక్షంగా దానిని నిలిపేశారని వాపోతూ ప్రకాశం జిల్లా తర్లపాడుకు చెందిన బి.వెంకటేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి... వివరాలు సమర్పించేందుకు రెండుసార్లు సమయం ఇచ్చినా సద్వినియోగం చేసుకోకపోవడంతో డీఎంహెచ్‌వోపై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: కొత్త జిల్లాలకు మార్చి 11కల్లా సిబ్బంది ఖరారు.. ఏప్రిల్ 2 నుంచి ...