ప్రకాశం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని చీరాల, పర్చూరు, వేటపాలెం, చినగంజాం, ఇంకొల్లు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పశ్చిమ ప్రాంతంలో ఎగువున కురుస్తున్న వర్షాలకు గిద్దలూరు, రాచర్ల, మార్కాపురం, అర్ధవీడు తదితర మండలాల్లో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది... పొలాలు, లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఉద్ధృతంగా సగిలేరు
గిద్దలూరు మండలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సగిలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గిద్దలూరు పట్టణంలో శ్రీనివాస థియేటర్ సమీపంలో పలు ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి సురక్షిత ప్రదేశాలకు తరలించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
వాగుల ఉగ్రరూపం..
రాచర్ల మండలంలోని లోతు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆకవీడు-అన్నంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కంభం మండలం, ఎర్ర పాలెం వద్ద గుండ్లకమ్మ వాగు ఉగ్రరూపం దాల్చటంతో.. పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అద్దంకి-బల్లికురవ రహదారిపై అంబడిపూడి సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నాట్లు వేసుకునేందుకు తెచ్చుకున్న వరి నారు వాగులో కొట్టుకుపోయాయి. సబ్జా తదితర పంటలు కోతకు వచ్చి ఉండటంతో ఈ వర్షం రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించింది.
ఇంకొల్లు మండలం దుద్దుకూరులో చినవాగు ఉద్ధృతికి పొలాలు నీట మునిగాయి. ఇంకొల్లు-గంగవరం మధ్య అప్పేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కారంచేడు మండలం అలుగువాగు ఉద్ధృతికి పల్లపు పొలాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. పర్చూరు మండలంలో పర్చూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో...ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మార్కాపురంలో కురిసిన భారీ వర్షానికీ భూపతిపల్లె, బొందలపాడు, పెద్దనాగులవరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: ఉరుములు, మెరుపులతో వర్షాలు... రైతుల ఆందోళన