మహిళా సంఘాలకు ఆర్ధికసాయంలో సహకారం అందించాల్సిన వ్యక్తే, మహిళల నిధులను స్వాహా చేసిన ఘటన ప్రకాశం జిల్లా దొనకొండ లో వెలుగు చూసింది. స్థానిక వెలుగు కార్యాలయంలో కమ్యూనిటీ కోర్డినేటర్ గా పనిచేసిన సుచేంద్రరావు, మహిళా సంఘాలకు అందాల్సిన ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని అతని భార్య ఖాతాలోకి మళ్లించాడు. నాలుగు సంవత్సరాలు దొనకొండ సీసీగా విధులు నిర్వహించిన సుచేంద్రరావు, ఇటీవలే సీఎస్ పురం మండలానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త వారు రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. సుచేంద్రరావు స్థానంలో వచ్చిన పాపారావు వెలుగు సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి మంజూరైన రుణాలపై ఆరా తీయగా, తమకు ఎటువంటి రుణాలు అందలేదని మహిళలు చెప్పడంతో సుచేంద్రరావు నిర్వాకం బయటపడింది. దీనిపై ఉన్నతాధికార్లకు ఫిర్యాదు చేయడంతదో మొత్తం పదమూడు లక్షల ఎనభై తొమ్మిదివేల ఐదు వందల రూపాయలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో నగద బదిలీ వెనుక బ్యాంకు సిబ్బంది సహకారం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుచేంద్రరావుపై విచారణ చేపట్టి, తగు చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికార్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఇద్దరు దొంగలు అరెస్టు... రూ.8.60 లక్షల సొత్తు స్వాధీనం