Prakasam Barrage: కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో.. దిగువకు వరద పోటెత్తుతోంది. ఈ ప్రభావం ప్రకాశం బ్యారేజీపై పడుతుండడంతో.. అధికారులు గేట్లెత్తి సముద్రంలోనికి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 4,54,833 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ తెలిపింది. దిగువన నాగార్జున సాగర్ నుంచి 1,88,098 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
పులిచింతల ప్రాజెక్టు నుంచి 2,46,376 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో.. ప్రకాశం బ్యారేజీ నుంచి 83,565 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇందులో 11,075 క్యూసెక్కుల నీటిని డెల్టా కాలువలకు, 71 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీలోని 70 గేట్లనూ 2 అడుగుల మేర ఎత్తి నీటిని కిందికి వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ సాయంత్రానికి గానీ, రేపు ఉదయంలోగా బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీ ఎగువన, దిగువ ప్రాంతాల్లోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది.
ఇవీ చదవండి: