తీవ్ర వర్షాభావ పరిస్థితులు... కలిసి రాని వ్యవసాయంతో జిల్లాలో ఎక్కువ శాతం రైతు కుటుంబాలు పాడిని నమ్ముకుంటున్నాయి. పశుపోషణ ద్వారా వచ్చే ఆదాయాన్ని నెలవారీ కుటుంబ అవసరాలకు సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాడి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వైఎస్సార్ పశు నష్టపరిహార పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఏడాది సెప్టెంబరు నుంచి పథకం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం పశువులు, గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు చనిపోతే.. సదరు పశు పోషకుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకే పరిహారం జమ చేస్తారు. ముర్రా జాతి, గ్రేడెడ్ గేదెలకు రూ. 30 వేలు, నాటు గేదెకు రూ. 15 వేల చొప్పున పరిహారం అందిస్తారు. ఒక్కో రైతు ఏడాదికి కనీసం అయిదు పశువులకు ఇలా పొందే అవకాశం ఉంది. పరిహారం పొందేందుకు గేదె వయస్సు కనీసం మూడేళ్లు పైబడి ఉండాలి. టీకాలు అమలు చేసేందుకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశువుల చెవులకు ట్యాగ్‌లు వేశారు. చనిపోయిన పశువుకు ట్యాగ్ లేకుంటే పశు వైద్యాధికారి నుంచి శవ పంచనామా నివేదిక అవసరం. గొర్రెలు, మేకలైతే కనీసం ఆరు నెలల వయసు ఉండాలి. ఏడాదిలో ఒక రైతు పేరు మీద 20 జీవాలకు మించి పథకం వర్తించదు. ఒక్కో దానికి రూ. ఆరు వేల చొప్పున చెల్లిస్తారు. ఎక్కువ సంఖ్యలో జీవాలు ఉన్నందున.. వాటికి ట్యాగ్‌లు వేయలేదు.
ఎన్నాళ్లో నిరీక్షణ
పథకం అమలు నిబంధనలు.. ప్రభుత్వ ఉద్దేశానికి భిన్నమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. పశువులను కోల్పోయిన రైతులు అన్ని వివరాలను సమర్పించినా.. పరిహారం మంజూరు కోసం గత అయిదు నెలలుగా ఎదురు చూడాల్సి వస్తోంది. పథకం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు పరిహారం మంజూరవగా- ఇప్పటి వరకు 1152 గేదెలు; 370 గొర్రెలు, మేకల మృతికి సంబంధించిన బిల్లులను పశుసంవర్ధకశాఖ అధికారులు పెట్టారు. కలెక్టర్ అనుమతి తీసుకుని ఖజానా శాఖకు పంపారు. 910 పశువులు, మరో 210 జీవాలకు పరిహారం కింద రూ. 2.74 కోట్ల మేర బిల్లులు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేశారు. వాటి తాలుకా మరో రూ. 53 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అవి పోను మార్చి నెల నుంచి ఇప్పటి వరకు సుమారు 600 పశువులు; మరో 150 గొర్రెలు, మేకలు మృతి చెందినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయానికి వివరాలు అందాయి. పాత బిల్లులతో కలిపి ప్రస్తుతం రూ. 2.42 కోట్ల మేర పరిహారం రైతులకు విడుదల కావాల్సి ఉంది. కొవిడ్-19 దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల కొరత నేపథ్యంలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు చర్చ నడుస్తోంది. దీనిపై పశుసంవర్ధకశాఖ జేడీ రవీంద్రనాథ్‌ఠాగూర్‌ను వివరణ కోరగా; పాడి రైతులకు వైఎస్సార్ నష్టపరిహారం కింద నిధులు మంజూరయ్యాయి. బిల్లులు పెట్టాం. త్వరలోనే రైతుల వ్యక్తిగత ఖాతాలకు నగదు జమ అవుతాయని చెప్పారు.
ఇదీ చదవండి: