Gundlakamma project: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎడమ కాలువ దిగువున.. దాదాపు 50వేల ఎకరాల్లో రైతులు శనగ, పొగాకు, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో గుండ్లకమ్మ ప్రాజెక్టులో మూడో గేట్ విరిగినా ఇంత వరకూ దాని పునరుద్ధరణ పనులు చేపట్టలేదు. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి, కాలువల ద్వారా పంపిణీ చేయాల్సిన నీరు పూర్తి స్థాయిలో విడుదల చేయడం లేదని రైతులు చెబుతున్నారు. ఎడమ కాలువ పరిధిలోని మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో శనగ, పొగాకు, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు చేతికొచ్చే సమయంలో.. వాటికి చివరి తడులు అందించాల్సి ఉంటుంది.
మాండౌస్ తుపాను వల్ల పంటలు ఆలస్యంగా వేయడం.. గుండ్లకమ్మ నుంచి పూర్తి స్థాయిలో నీరు రాకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో పిచ్చి మొక్కలు, తూడును ప్రతి ఏడాదీ తొలగించాల్సి ఉన్నప్పటికీ మూడేళ్లుగా తొలగించకపోవడంతో.. పెద్దఎత్తున పేరుకుపోయాయి. దీంతో నీటి పారుదల సక్రమంగా లేక తమ పరిస్థితి దారుణంగా మారిందని శివారు భూముల రైతులు చెబుతున్నారు. నిధుల కొరతతో తామేమీ చేయలేక పోతున్నామని అధికారులు చెబుతున్నారు అని రైతులు అంటున్నారు.. చేసేదిలేక సొంత ఖర్చులతో కాలువకు మరమ్మతులు చేయించుకుంటున్నారు. కాలువలో పూడిక తీతలు చేపట్టడంతో పాటు అడ్డంకులు తొలగించి.. పంటలకు నీరు సక్రమంగా చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఈ కాలువని బాగు చేయాలి.. ఇందులో ముళ్ల కంప, జమ్ము మొలిచాయి. నీళ్లు బాగా రావడం లేదు.. అంతంత మాత్రంగానే వస్తున్నాయి. గేట్లు బాగు చేయలేదు. తాగు నీటికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. పంటలు అన్నీ ఎండి పోతున్నాయి. ఇప్పటికే వారం రోజలకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. ముందు ముందు అవి కూడా రావు అనిపిస్తోంది. ఓ పక్కనేమో పంటలు ఎండి పోతున్నాయి.- హనుమానయ్య, రైతు
సుమారు 50 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఈ సాగుబడిలో మిర్చి, మొక్కజొన్న, పొగాకు, శనగ అనేక రకాల కూరగాయలు, పంటలు రైతులకు జీవనోపాధిగా ఈ నీటితో సాగు చేస్తున్నాము. కానీ గేటు విరిగిపోయినందున నీరు అస్సలు ఉండట్లేదు. అందు వల్ల ఎడమ కాలువకి నీళ్లు ఎక్కువగా ఇస్తే కాని అందరికీ సరిపోవు.. ఇలాంటి పరిస్థితుల్లో దిగువన ఉన్న ఊర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.- రేగు ఉమా మహేశ్వరరావు, రైతు
ఇవీ చదవండి: