ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్ కింద వరి ధాన్యం కొనుగోలుకు 140 కేంద్రాలు అవసరమని అనుమతి తీసుకున్నారు. ఇప్పటివరకు 76 కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు ప్రారంభించారు. ఒక్కో కేంద్రాన్ని ప్రారంభ తేదీ నుంచి 70 రోజుల వరకు నిర్వహిస్తారు. వీటిని పీఏసీఎస్, వైఎస్సార్ కాంతిపథం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో లక్ష టన్నుల సేకరణ లక్ష్యంకాగా, ఇప్పటివరకు 28,500 టన్నులే తీసుకున్నారు. గుడ్లూరు మండలంలోని బసిరెడ్డిపాలెం, అమ్మవారిపాలెం, గుడ్లూరు, వీరేపల్లి, మోపాడు, కరేడు, భీమవరం, పొట్లూరు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటిలో పీఏసీఎస్ గుడ్లూరు ఆధ్వర్యంలో చురుగ్గా కొనుగోలు జరుగుతుండగా, డీఆర్డీఏ ద్వారా ఏర్పాటుచేసిన కేంద్రాల్లో మందగించింది. బయట మార్కెట్లో 75 కిలోల బస్తా రూ.1000 మాత్రమే పలుకుతుండగా; ఆర్‌బీకెల్లో రూ.1401 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎక్కువమంది రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ధాన్యం సేకరణకు సరిపడా గోతాలను ప్రాథమికంగా పౌర సరఫరాల సంస్థ సమకూర్చాలి. సకాలంలో స్పందించకపోవడంతో రైతులే ఒక్కొక్కటి రూ.40 చొప్పున కొనుగోలు చేసి అదనపు భారం భరిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో గోతాలు లేక తూకం కూడా వేయడం లేదు.
ఎప్పుడు తూకం వేస్తారోనని..
కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని పది రోజులు పాటు ఆరబెట్టాలి. తేమ శాతం 17 లోపు వచ్చేలా ఉంచాలి. నిబంధనల మేరకు అంతకు మించితే కొనుగోలు చేయరు. ధాన్యంలో అన్య పదార్థాలు లేకుండా పరిశుభ్రం చేయాలి. తదనంతరం రాశులుగా పోసి పట్టలు కప్పి ఉంచుతారు. ఇక ఎప్పుడు తూకం వేస్తారోనని నిర్వాహకుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. తీరా తూకం వేసిన తర్వాత లారీల్లో తరలించేంతవరకు కాపలా ఉండాలి. కాటా వేసిన తర్వాత వెంటనే తరలిస్తే సమస్య ఉండదు. కానీ మిల్లర్లు లారీల్లోని ధాన్యాన్ని దింపుకోవడం ఆలస్యం చేస్తుండటంతో కనీసం మూడు నాలుగు రోజులకు ఒక లారీ ధాన్యాన్ని తరలించడం గగనంగా మారింది. బసిరెడ్డిపాలెం కొనుగోలు కేంద్రం పరిస్థితి ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఉంటోంది. ధాన్యాన్ని సుమారు 20 రోజులకు పైగా అక్కడే ఉంచుతున్నారు. దీంతో తేమ శాతం తగ్గిపోవడం ద్వారా తూకం తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంకా 30 లారీల ధాన్యం నిల్వ ఉంది.
* కందుకూరు మండలం పందలపాడు, పలుకూరు గ్రామంలోని కేంద్రాల్లో వారం రోజుల క్రితం 2 వేల బస్తాలు ధాన్యం కాటా వేసి మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. ఒంగోలు మండలం చేజర్ల, ముండ్లమూరు మండలం వేముల, ఉల్లగోలు గ్రామంలోని కొనుగోలు కేంద్రాల వద్ద 1000 బస్తాల చొప్పున తూకం వేసి సిద్ధం చేశారు. ఇంతవరకు లారీలు రాలేదు. ధాన్యం బస్తాలు మిల్లుకు చేరిన తర్వాత ట్రక్కు షీటును యజమానులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తేనే రైతుల ఖాతాలకు నగదు జమ అయ్యేది. ఈ పరిస్థితుల్లో చిన్నపాటి వాన పడినా ఆర్థికంగా రోడ్డున పడాల్సిందేనన్నది రైతుల వేదన.
* ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడ్డాయి...ఆశించిన మేర దిగుబడి వచ్చిందని ఊరట చెందిన అన్నదాతకు ధాన్యం అమ్మకంలో ఇబ్బందులు తప్పడం లేదు. మద్దతు ధర వచ్చేలా రైతు భరోసా కేంద్రాల అనుసంధానంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల వద్ద కష్టాలు ఎదురవుతున్నాయి. మెరుపులు మెరిసినా, చిన్నపాటి గాలి వీచినా, చిరుజల్లులు కురిసినా అర్ధరాత్రి సమయంలో ధాన్యం రక్షించుకోవడానికి కేంద్రాలకు రైతులు పరుగులు తీయాల్సిన పరిస్థితి. గోతాల సరఫరా, ధాన్యం తరలింపులో నెలకొన్న జాప్యమే అవరోధంగా మారింది.
త్వరగా తరలించాలి
కేంద్రాలకు ధాన్యం తీసుకుని వచ్చిన తర్వాత పది రోజులు పాటు ఆరబెడుతున్నాం. తర్వాత కాటా వేస్తారు కానీ తరలింపు ఆలస్యమవుతోంది. అప్పటివరకు వాటిని రైతులే రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఇబ్బందిగా మారింది. మిల్లుల నుంచి లారీలు త్వరగా వస్తే వెంటనే తరలించవచ్చు. గుడ్లూరు కేంద్రానికి 20 రోజుల క్రితం ధాన్యం తీసుకువచ్చాను. రెండు రోజుల కిందట కాటా వేశారు. ఇంతవరకు తరలించలేదు. - కె.మాల్యాద్రి, గుడ్లూరు
రవాణా సమస్యను పరిష్కరించాం
కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేసి మిల్లులకు తరలించేందుకు రవాణా సమస్య నెలకొంది. పరిష్కార నిమిత్తం బయట లారీలను కూడా తీసుకొచ్చేలా గుత్తేదారులకు చెప్పాం. ఒక్కో గోతాం ధరను కూడా రూ.16 నుంచి రూ.20కు పెంచాం. ఈ నెలలో రేషన్ డీలర్ల వద్ద నుంచి 6 లక్షల గోతాలు సేకరించనున్నాం. - నారదముని, డీఎం, పౌరసరఫరాల సంస్థ
ఇదీ చదవండి: ఆగని రెమ్‌డెసివిర్ దందా.. వైద్య సిబ్బంది ప్రమేయంతో నల్లబజారుకు