Minister Adimulapu Suresh: ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్సార్ సున్నావడ్డీ పథకం ప్రారంభానికి మంత్రి సురేశ్ సమయానికి హాజరుకాకపోవడంపై.. మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మార్కాపురం వచ్చిన సురేష్‌కు.. స్థానిక నేతలు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అదే సమయంలో డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ పథకం ప్రారంభ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని చెప్పిన అధికారులు.. 9 గంటల కల్లా డ్వాక్రా మహిళలందరూ తప్పకుండా హాజరు కావాలని సూచించారు.
దీంతో మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలు దాటినా మంత్రి రాలేదని.. ఉదయం నుంచి ఎదురుచూస్తున్నామంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి రాలేనప్పుడు కార్యక్రమం పెట్టడం ఎందుకని నిలదీశారు. తర్వాత ఇళ్లకు వెళ్లేందుకు బయటకి రాగా.. సమావేశం నుంచి వెళ్లకూడదంటూ డ్వాక్రా ఆర్పీ అడ్డుకున్నారని.. వెళితే డబ్బులు రాకుండా చేస్తామని, ప్రభుత్వ పథకాలన్నీ ఆపుతామని బెదిరించారని మహిళలు వాపోయారు.
‘మీరు మంత్రి రాకముందే సభలోంచి వెళ్లిపోతే వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం డబ్బులు నిలిపేస్తాం.. సంఘాల నుంచి తొలగిస్తాం’.. పొదుపు మహిళలకు మెప్మా ఆర్పీలు బెదిరించారు. పథకం డబ్బులు జమ చెయ్యం, బ్యాంకు రుణాలు రాకుండా చేస్తామంటూ బెదిరించడంతో మహిళలు ప్రతిఘటించారు. కాసేపు వారి మధ్య వాదులాట జరిగింది. ‘మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ’ పలువురు వెళ్లిపోయారు. ఈలోగా జిల్లా మెప్మా పీడీ రవికుమార్ వారి వద్దకు వచ్చి మంత్రి వస్తున్నారు రావాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు మధ్యాహ్నం 2.15 నిమిషాలకు మంత్రి కార్యక్రమం ప్రారంభమైంది.
గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు..: ‘‘మంత్రి వస్తున్నారని, సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని చెబితే 9 గంటలకే వచ్చాం. మధ్యాహ్నం 2 గంటలైనా కనీసం గుక్కెడు నీళ్లయినా ఏర్పాటు చేయలేదు. పైగా ప్రయోజనాలన్నీ నిలిపేస్తామంటూ బెదిరించడం ఎంతవరకూ సబబు?’ అని మార్కాపురానికి చెందిన చాబోలు పెద్దక్క అనే పొదుపు మహిళ వాపోయారు.
ఇదీ చదవండి: 'తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన... వైకాపా ప్రభుత్వ వైఫల్యమే'