ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని కారంచేడు రోడ్డులో ఉన్న సుమారు వంద ఎకరాల తాగు నీటి చెరువును కృష్ణా జలాలతో నింపి.. ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు. చెరువు ఉన్న ప్రాంతం నల్లరేగడి నేల కావటం.. నీటిని తొలుత ఫిల్టర్ బెడ్‌కు తరలించి శుభ్రం చేస్తున్నారు. దీనివల్ల బెడ్లో ఉన్న ఇసుకలోకి మట్టి చేరుతుంది. తర్వాత 2 పిఎం క్లోరిన్ గ్యాస్‌తో శుద్ధిచేసి పట్టణంలోని ప్రధాన ట్యంకులకు మళ్లిస్తున్నారు. అక్కడ మరో 1.5 సీఎం క్లోరిన్ గ్యాస్ తో శుభ్రం చేసి మిగిలిన ట్యాంకులకు.. తద్వారా కుళాయిలకు నీటిని సరఫరా చేస్తున్నారు.
చీరాల పట్టణంలోని సరఫరా పైపులైన్లు మూడున్నర దశాబ్దాల క్రితం వేసినవి కావటంతో పలు ప్రాంతాల్లో పైప్ లైన్లు లీక్ అవుతున్నాయి. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో పేరాల సొసైటీ వద్ద మంచి నీటి పైప్ లైన్ లీకై రహదారులపై వృధాగా పారుతుంది. కలుషితమైన నీళ్లు కుళాయిలకు వస్తాయేమోనని పట్టణ ప్రజలు భయపడుతున్నారు. గొల్లపాలెం, ఉజిలిపేట, దండు బాట ప్రాంతాల్లో మురుగు కాలువలు సరిగా లేకపోవటం.. వాటిపైనే తాగునీటి సరఫరా పైపులు ఉండటం.. వర్షాలు సమయాల్లో ఆయా ప్రాంతాల్లో రోజుల తరబడి మురుగునీరు నిలిచిపోవటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఒక్కోసారి దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అవుతుందని స్థానికులు చెబుతున్నారు.
ఏ మున్సిపాలిటీలో లేని విధంగా చీరాలలో రెండు విడతలుగా క్లోరిన్ గ్యాస్‌తో నీటిని శుభ్రం చేస్తున్నామని.. ప్రతి మూడు నెలలకు ఓసారి గుంటూరులోని రీజనల్ మెడికల్ సెంటర్ వచ్చి నీటిని పరిశీలిస్తారని చీరాల ఇన్చార్జ్ కమిషనర్ ఏసయ్య తెలిపారు. పట్టణంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని 24 గంటల్లో మరమ్మతులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...