లౌకికవాద పార్టీలుగా ఉన్న తెదేపా, వైకాపాలకు.. భాజపా భయం పట్టుకుందని ప్రకాశం జిల్లాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఎక్కడో ఆకతాయిలు దేవుని విగ్రహాల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. హిందూ మతానికి ఏదో జరిగిపోయినట్లు వీరు అతిగా స్పందిస్తున్నారన్నారు. రైతు ఉద్యమం దేశంలోనే అత్యంత ముఖ్యమైన అంశం కాగా.. 25 రాజకీయ పార్టీలు వారికి మద్దతు ఇస్తున్నాయని గుర్తుచేశారు. దీనిపై రాష్ట్రంలోని పార్టీలు మాట్లాడటంలేదని విమర్శించారు. కేంద్రంలోని భాజపాకు భయపడి.. వారి అజెండాను తెదేపా, వైకాపాలు మోస్తున్నాయని ఆరోపించారు.
వారికి తోడు డీజీపీ సైతం చిన్న విషయాన్ని రాజకీయం చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. సంఘటన జరిగిన ప్రాంతపు పోలీసులు తమ పని తాము చేసుకుంటారని.. డీజీపీ స్పందించాల్సిన అవసరమేంటని రామకృష్ణ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో ఎస్పీని గురించి వైకాపా ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మాట్లాడటం దారుణమన్నారు. పోలీసు వ్యవస్థను అధికార పార్టీ నిర్వీర్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇదీ చదవండి: తెదేపా కార్యకర్త మృతుని కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భరోసా