కొవిడ్ రోగులకు సత్వర చికిత్స అందించేందుకు నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సన్నద్ధంగా ఉండాలని.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో ఆయన వైద్యాధికారులతో సమావేశమయ్యారు. వైద్యం అందించడానికి నోటిఫై చేసిన ఆసుపత్రులన్నింటిలోనూ మౌలిక వసతులు కల్పించుకోవాలన్నారు. గతేడాది ఎదురైన పరిస్థితిని గుర్తుంచుకొని.. పడకల అందుబాటులో ఉంచాలని, మందులు, చికిత్స విషయంలో ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వైద్యం అవసరమైనవారిని సకాలంలో ఆసుపత్రికి చేర్చాలన్నారు.
నివేదికలు సమర్పించాలి
ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, పీపీఈ కిట్లు, సీసీ టీవీలు, హెల్ప్‌డెస్క్‌లు, శానిటేషన్, ఆహారం, మానవ వనరుల లభ్యత, అగ్నిప్రమాద నివారణ, ఇతర సదుపాయాలపై నోడల్ అధికారులు.. ఈ నెల 12వ తేదీ సాయంత్రానికల్లా నివేదికలు ఇవ్వాలన్నారు.
హోం ఐసోలేషన్‌లో ఉన్న వారి గురించి ఆరా
హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి గురించి ఎప్పటికప్పుడు ఆరా తీయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలిచ్చామని.. సంయుక్త పాలనాధికారి చేతన్ తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌వో పి.రత్నావళి సహా పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నేటి నుంచి టీకా ఉత్సవ్.. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత