జిల్లాలో సుమారు అయిదు వేలకుపైగా లారీలు ఉండొచ్చని అధికారుల అంచనా. వాటి ద్వారా గ్రానైట్, పొగాకు, మిర్చి, ధాన్యం, పత్తి, పాలు తదితరాల రవాణా జరుగుతోంది. లాక్‌డౌన్ కారణంగా 90 శాతం వాహనాలు నిలిచిపోయాయి. అతి కొద్ది లారీల ద్వారా మాత్రమే కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువులు రవాణా అవుతున్నాయి. దీంతో యజమానులు ప్రతి నెలా కిస్తీ (ఈఎంఐ)లు సైతం చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.
సరాసరిన యజమాని ఒక్కో లారీకి కనీసం నెలకు రూ. 50 వేల నుంచి రూ. 80 వేల వరకు చెల్లించాల్సి ఉంది. ఇంకోవైపు మూడు నెలలకు ఒకసారి చెల్లించే పన్ను భారీగా పెరిగింది. సుమారుగా ఆరు చక్రాల లారీకి రూ. 3350, పది చక్రాలకు రూ. 6300, 12 చక్రాలకు రూ. తొమ్మిది వేలు, 14 చక్రాలకు రూ. 11వేలు చెల్లించాల్సి ఉంది. లారీలు పూర్తిగా నిలిచిపోవడంతో ఓ పక్క కిస్తీలు, మరోవైపు ట్యాక్సులు చెల్లించలేకపోతున్నామని అంటున్నారు.
ప్రభుత్వం ఈ నెల రోజులకు ట్యాక్సులు ఎత్తివేయాలని లారీ యజమానుల సంఘం నాయకులు కోరారు. ఇక లారీ డ్రైవర్లు, క్లీనర్లకు నెలవారీ జీతాలు కాకుండా తోలిన బాడుగలో 11 శాతం కమిషన్‌గా చెల్లిస్తున్నారు. నెలకు పైగా లారీలు తిరగకపోవడంతో వారికి ఒక్క రూపాయి కూడా రావడం లేదని, కుటుంబ అవసరాలకూ ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. మెకానిక్‌లు, ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు, పంక్చర్ దుకాణదారులు సైతం జీవనోపాధి కోల్పోయారు.
ఇవీ చూడండి:
ఆ ఊళ్లో మద్యాన్ని ఎలుకలు తాగేస్తున్నాయట!