Road Runway in prakasam : అత్యవసర సమయంలో రహదారులపై విమానాల ల్యాండ్ అయ్యేందుకు ఎయిర్ ప్యాడ్ల నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 13 నగరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణాలను చేపట్టారు. ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం లేకపోయినా.. అత్యవసర సేవలకు వీలుగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై రన్ వే ఏర్పాటు చేస్తున్నారు. కొరిసపాడు- రేణింగవరం, కలికివాయ- సింగరాయకొండ వద్ద 2019లో రన్ వే పనులు ప్రారంభించారు. ఏడాదిలోపే పనులను పూర్తి చేయాలని అధికారులు భావించినప్పటికీ పనులు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను కేటాయించింది. దీంతో కాంక్రిట్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాగా.. ఇరువైపులా ఉన్న మట్టి రోడ్డు, డ్రైనేజీ కాలువ, బ్రిడ్జి నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి.
నిర్మాణంలో ఉండగానే...
పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేయకపోవడం వల్ల పూర్తైనా.. కాంక్రీట్ రోడ్డు కూడా దెబ్బతింటోంది. కలికివాయ - సింగరాయకొండ రహదారిపై నిర్మించిన కాంక్రీట్ రోడ్డుపై కంకర తేలి ప్రమాదకరంగా మారింది. దీనిపై తారు పోసి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. కొరిసపాడు- రేణింగవరం రన్ వే లోనూ కంకర తేలింది. నిర్మాణంలో ఉండగానే.. ఇలా తరచూ మరమ్మతులు చేయాల్సి రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసంపూర్తిగా ఉన్న రహదారిపై ప్రయాణాలు చేస్తూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
రాజస్థాన్‌లో ప్రారంభించగా.. ఇక్కడ మాత్రం..
ఏడాది క్రితం రాజస్థాన్‌లో ఈ తరహా రన్ వే ను ప్రారంభించగా.. అదే సమయంలో ప్రకాశంలోనూ ప్రారంభిస్తారని ప్రచారం సాగింది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణం జరగకపోవడంతో పాటు ప్రమాదాలకు దారీ తీస్తోంది. అత్యవసర పరిస్థితి కోసం కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
మట్టి రోడ్లను త్వరగా పూర్తి చేయడంతో పాటు.. రన్ వే కు ఇరువైపుల పెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనివల్ల అడ్డదారిలో వచ్చే వాహనాల రాకపోకలు ఆగి.. ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి : Lock to Village Secretariat: బిల్లులు చెలించలేదని గ్రామ సచివాలయానికి తాళం..!