Chandrababu PPT on Prakasam District Projects: సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరిట తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి అక్కడే పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు.
పది లక్షల కోట్ల అప్పు చేసినా.. గుండ్లకమ్మ గేటు మరమ్మతుకు కోటి ఖర్చు పెట్టలేరా అని నిలదీశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ఇరిగిపోయిన గేటు గురించి మాట్లాడలేని మంత్రి బ్రో సినిమా గురించి మాత్రం మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని హామి ఇచ్చారు.
జీవో ఇచ్చినా నిధిలు విడుదల కాలేదు: మళ్లీ వైసీపీకు ఓటేస్తే రాష్ట్రంలో వాలంటీర్ ఉద్యోగాలు తప్ప చదువుకున్న వాళ్లు కూడా మిగిలరని వ్యాఖ్యానించారు. జగన్ రివర్స్ నిర్ణయాలతో ఇరిగేషన్ రంగాన్ని రివర్స్ చేసేశాడని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల కమిషన్ల కక్కుర్తి వల్ల పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ధ్వజమెత్తారు. భూసేకరణ కోసం 1300 కోట్లకు జీవో ఇచ్చినా నిధులు విడుదల కాలేదని మండిపడ్డారు.
నిధుల అందక మూలనపడ్డాయి: 7000 మందికి పైగా ఉన్న నిర్వాసితుల కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ అందలేదని దుయ్యబట్టారు. ఐఎన్ఎస్పీ జవహర్ లాల్ కెనాల్ (కుడి కాలువ) మరమ్మతులు లేక కాలువలు పూడుకుపోయాయని.. 4 ఏళ్లుగా వాటర్ రీషెడ్యూలు కూడా ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా పశ్చిమ డెల్టా వ్యవస్థ నిధులు అందక ఆధునీకరణ పనులు మూలానపడ్డాయని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఏళ్లు గడుస్తున్నా భూసేకరణ జరగలేదు: గుంటూరు ఛానల్ - పర్చూరు వరకు ఎక్స్‌టెన్షన్ ఆయకట్టు రివర్స్ టెండరింగ్ పేరుతో టెండర్ల రద్దు 4 ఏళ్లు గడుస్తున్నా భూసేకరణ జరగలేదని ఆక్షేపించారు. రైతులు ఉద్యమించినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీఆర్ కొరిశపాడు లిఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకుండా రిజర్వాయరులో ఇసుక తోడేస్తున్నారని ఆరోపించారు.
గేట్లు కొట్టుకుపోయి సంవత్సరం గడుస్తున్నా: రాళ్లపాడు ప్రాజెక్ కాలువల పూడిక తీయలేదని.. మరమత్తులు కూడా చేయలేదని దుయ్యబట్టారు. పాత స్పిల్ వే గేట్లు దెబ్బతినడంతో నీరు వృథా అవుతోందని విమర్శించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టలో గేట్లు ధ్వంసం అవుతున్నా కోటి రూపాయలతో మరమ్మతులు చేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్వహణ లేక 3 గేట్లు కొట్టుకుపోయి సంవత్సరం గడుస్తున్నా వాటిని ఏర్పాటు చేయలేదని విమర్శించారు. డ్యామ్‌లో నీరు నిల్వ చేయకుండా డ్రెడ్జెర్లతో వందల టన్నుల ఇసుక తవ్వుతున్నారని మండిపడ్డారు.
కాలువలు లేక నిరుపయోగంగా: సోమశిలలో పూడిక వల్ల 0.5 టీఎంసీల నీరు కూడా రావడం లేదన్నారు. పాలేటిపల్లి రిజర్వాయర్ 3 ఏళ్ళ నుండి పనులకు బ్రేక్ పడిందని మండిపడ్డారు. ఇంకా కుడి, ఎడమ కాలువల భూసేకరణ పూర్తికాలేదని ధ్వజమెత్తారు. రిజర్వాయర్ నిండినా కాలువలు లేకపోవడంతో నిరుపయోగంగా మారిందని ఆక్షేపించారు. కంభం ట్యాంక్ ఆధునీకరణ జరగలేదన్నారు.
2021 లో వరదల వల్ల నీరు పూర్తిగా నిండి కట్టకు లీకులు ఏర్పడాయని తెలిపారు. మరమత్తుల కోసం పంపిన 3.5 కోట్ల ప్రతిపాదనలను వైకాపా ప్రభుత్వం మంజూరు చేయలేదని మండిపడ్డారు. కేటాయించిన 1.28 కోట్ల నిధులు కూడా విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. పవర్ పాయింట్ ప్రదర్శన అనంతరం దెబ్బతిన్న గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లను చంద్రబాబు పరిశీలించి అక్కడే బహిరంగసభలో పాల్గొన్నారు.