అర్ధంతరంగా నిలిచిన బైపాస్ రోడ్డులో మొలిచిన పిచ్చిమొక్కలు
బైపాస్ నిర్మాణం పూర్తికాకపోవడంతో మన జిల్లాతో పాటు ప్రకాశం, నెల్లూరు ప్రాంత వాసులు రాకపోకలు సాగించే అద్దంకి - నార్కట్‌పల్లి రహదారిపై అవస్థలు తప్పడం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనదారులకు పిడుగురాళ్ల(లైమ్‌సిటీ) వద్ద అంతరాయం ఏర్పడుతోంది. రహదారిపై రద్దీతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి.
అద్దంకి - నార్కట్‌పల్లి రోడ్డు నాలుగు వరుసలుగా విస్తరించేందుకు టెండరు దక్కించుకున్న గుత్తేదారు 2011లో పనులు ప్రారంభించారు. అద్దంకి నుంచి నార్కట్‌పల్లి వరకు 212 కిలోమీటర్లు దూరంలో చేపట్టే రోడ్డు విస్తరణకు రూ.1196 కోట్లు కేటాయించారు. నిర్మాణ పనుల్లో భాగంగా పిడుగురాళ్ల పట్టణ సమీపంలో ఆరు కిలోమీటర్లు బైపాస్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం 60 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అయితే భూసేకరణ చేయకుండా 2012 మార్చిలో బైపాస్ పనులు చేపట్టడంతో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీని నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు పనులు ఆపాలని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పలుమార్లు సమావేశమై భూములు కోల్పోయిన రైతులకు పరిహారం నిర్ణయించారు. 2016 సంవత్సరం ఆఖరులో 41 ఎకరాల భూములకు పరిహారం చెల్లించారు. దీంతోపాటు 11 ఎకరాలు చెరువు భూమి కూడా రోడ్డు నిర్మాణంలో పోతోంది. ఈ 52 ఎకరాల పరిధిలో రోడ్డు నిర్మాణాన్ని చాలా వరకు పూర్తి చేశారు. ఇవిగాక మాచర్ల రోడ్డులో ఖలీల్ రెస్టారెంటు ఎదురు భాగంలో 4.60 ఎకరాలు ప్రభుత్వ భూమిని చాలాకాలం నుంచి రైతులు సాగు చేసుకుంటున్నారు. వారికి ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది. ప్రభుత్వ భూమికి ఎలాంటి పరిహారం చెల్లించనవసరం లేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. కాని రైతులు మాత్రం మాకు కూడా పరిహారం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. గుంటూరు రోడ్డు వైపు 3.17 ఎకరాలు భూమికి పరిహారం నిర్ణయించాల్సి ఉంది. ఈ భూములు కోల్పోయే రైతులు పరిహారం గజాల లెక్కన కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం ప్రభుత్వ విలువకు కొంత కలిపి ఇస్తామని చెబుతున్నారు. వీరితో రెవెన్యూ అధికారులు పరిహారం నిర్ణయించడానికి సమావేశాలు నిర్వహించిన ఎలాంటి పురోగతి లేదు. రెవెన్యూ అధికారులు మాత్రం బలవంతంగా భూములు లాక్కొని రోడ్డు నిర్మాణం చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. అవి కోల్పోయిన రైతులు కోర్టుకు వెళ్లి పనులు నిలిపివేయిస్తామని అంటున్నారు.
- రైల్వే వంతెనకు ఆర్థికశాఖ క్లియరెన్స్
పిడుగురాళ్ల పట్టణ సమీపంలో నిర్మాణం చేసే బైపాస్ రోడ్డులో నిర్మించాల్సిన రైల్వే వంతెనకు రాష్ట్ర ఆర్థికశాఖ నుంచి క్లియరెన్స్ లభించింది. రైల్వే వంతెన నిర్మాణానికి రూ.8.5 కోట్లు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న గుత్తేదారులు వెంటనే నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో వాహనాల రద్దీ బాగా పెరిగింది. ఎక్కడ వాహనం ఆగిపోయినా కొద్ది సమయంలోనే దాని వెనుకే వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరుతున్నాయి. మరోవైపు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
- వారంలో పనులు ప్రారంభించమని చెప్పాం
బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు వారంలోగా ప్రారంభించమని రాంకీ సంస్థ నిర్వాహకులకు చెప్పాం. ఆ సంస్థ ఇంజినీర్లు, రోడ్డు అభివృద్ధి సంస్థ అధికారులు ఇటీవల బైపాస్ మార్గం పరిశీలించారు. ముందుగా పిల్లుట్లరోడ్డులోని వంతెన నిర్మాణ పనులు, తర్వాత మాచర్ల రోడ్డులోని ప్రభుత్వ భూమిలో పనులు చేయాలని చెప్పాం.
- చంద్రశేఖరరెడ్డి, ఇన్‌ఛార్జి డీఈ
- ఈ నెలాఖరుకు భూసేకరణ ప్రక్రియ పూర్తి
మాచర్ల రోడ్డు వైపు ఖలీల్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న 4.60 ఎకరాల భూమిని రోడ్లు భవనాలశాఖ అధికారులకు అప్పజెప్పాం. గుంటూరు రోడ్డులోని 3.17 ఎకరాల భూమి సేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశాం. అది విడుదల చేసి ఈనెల 12వ తేదీకి 60 రోజులు పూర్తవుతుంది. తర్వాత రైతుల వద్ద అభ్యంతరాలు స్వీకరిస్తాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత మూడేళ్లలో క్రయ విక్రయాలను పరిశీలించి దాని ప్రకారం పరిహారం నిర్ణయిస్తాం. సోషల్ ఎకనామిక్ సర్వే పూర్తి చేశాం. రైతులకు డబ్బులిచ్చి ఈనెలాఖరుకు భూసేకరణ పక్రియ పూర్తి చేస్తామని ఆర్డీవో పార్థసారథి పేర్కొన్నారు.
ఇవీ చూడండి...