BUFFALOES DIED WITH ELECTRIC SHOCK: సాధారణంగా పశువులు మేతకు వెళితే సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాయనే ధీమా ప్రతి యజమానికి ఉంటుంది. ఒకవేళ రావడం ఆలస్యమైతే.. ఇంకో గంటకు వస్తాయిలే అని ఎదురుచూస్తారు. కానీ అక్కడి గేదెలు మాత్రం బయటికి వెళ్తే.. ముఖ్యంగా పొలాల్లోకి వెళ్తే వస్తాయో రావో తెలియని భయం. కాలం చెల్లిన విద్యుత్ తీగలతో ప్రకాశం జిల్లాలోని రైతన్నలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పొలాల్లోకి వెళ్లిన గేదెలు ఇంటికి వచ్చేదాకా వారికి టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే.. హనుమంతునిపాడులో జరుగుతున్న ఘటనలే వారి భయానికి కారణమవుతున్నాయి.
తాజాగా మండలంలో రెండు రోజుల వ్యవధిలో రెండు గ్రామాల పరిధిలోని 7 గేదెలు విద్యుత్ తీగల కారణంగా మృత్యువాతపడ్డాయి. ఆ ఘటన మరువకముందే నేడు.. దొంతవారిపల్లి పొలాల్లో తీగలు తగిలి మరో రెండు పశువులు మరణించాయి.గతంలో ఇదే ప్రాంతంలో ఇద్దరు అన్నదాతలు మృతి చెందిన ఘటనలు కూడా సంభవించాయి. ఇలా రోజూ మండలంలో ఏదో ఒకచోట విద్యుత్ తీగలు తెగి పడి.. ప్రమాదాలు జరుగుతుండడంతో పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడవలసిన పరిస్థితి నెలకొందని పశువుల కాపరులు, రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి కాలం చెల్లిన విద్యుత్ తీగలను తొలగించి.. వాటి స్థానంలో నూతన తీగలను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: