వ్యవసాయంపై ఆధారపడిన ప్రకాశం జిల్లా రైతులకు అధికంగా రుణాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో చేసిన తీర్మానాలు జిల్లాలో అమలు చేయాలన్నారు. జిల్లా ప్రజల అవసరాలు వారి పరిస్థితుల దృష్ట్యా అజెండాలో స్వల్ప మార్పులు చేసుకోవాలన్నారు. కమిటీ నిర్ణయించిన అంశాలపై బ్యాంకర్లు దృష్టి సారించాలని ఆయన చెప్పారు. జిల్లాలో చేయూత పథకంలో 5,031 దరఖాస్తులు రాగా కేవలం 1,054 మందికి రుణాలు ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి గత ఏడాది అడ్వాన్స్ రూ.15,367,12(56.06 శాతం) కోట్ల రుణాలను పంపిణి చేయడమేంటని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రస్తుతం పంట రుణాల కింద రూ. 8.477.50 కోట్లు రైతులకు పంపిణీ చేయగా.. అనుబంధ రంగానికి రూ.2376.55 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి
జగనన్న పాలవెల్లువ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ చెప్పారు. ఈ నేపథ్యంలో మహిళల ఆర్థిక ఎదుగుదలకు రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను ఆయన ఆదేశించారు. డెయిరీ యూనిట్లను మహిళలకు మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. పొదుపు మహిళల బ్యాంకు రుణాల రికవరీ నూరు శాతం ఉన్నందున రుణాలు విరివిగా ఇవ్వాలన్నారు. వేలాది మంది కౌలు రైతులు పంట సాగు చేస్తుండగా.. కేవలం 18 వేల మందికే సీపీఆర్సీ కార్డులు ఇవ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో 2.28 లక్షల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేసి రుణాలు ఇవ్వడం సంతోషదాయకమన్నారు. రైతు భరోసా కేంద్రాల వద్దనే రైతులకు అన్ని ప్రయోజనాలు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉత్పత్తయ్యే పంటలు, దిగుబడి, ఎగుమతి అంశాలపై అధికారులు పూర్తిస్థాయి అవగాహన ఉండాలని ఆయన సూచించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. జిల్లాలో డిజిటల్ పేమెంట్లు అధికంగా జరిగాయని కలెక్టర్ చెప్పారు. బ్యాంకు లావాదేవీలు, నగదు చెల్లింపులన్నీ డిజిటల్ పద్ధతిలో జరగడం సంతోషదాయకమన్నారు. 3,056 మంది చేనేత కార్మికులకు రూ.15.28 కోట్లు రుణం ఇవ్వాలనే లక్ష్యానికి కేవలం 323 మందికి రూ.1.26 కోట్లు పంపిణీ చేయడంపై ఆయన నిలదీశారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆర్బీ అండ్ ఆర్) జె. వెంకటమురళి, ఎల్డీఎం యుగంధర్ రెడ్డి, నాబార్డ్ డీడీఎం వెంకట రమణ, వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామమూర్తి, డీఆర్డీఏ పీడీ బాబూరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: DISHA APP: 'దిశ' యాప్ ఉంటే..అన్నయ్య తోడున్నట్లే: సీఎం జగన్