శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన డాక్టర్ ఎన్.భాస్కరరావు.. ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారిగా పనిచేస్తున్నాడు. కరోనా సమయంలో విధుల్లో భాగంగా దాదాపు 6 వేల మందికి కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. చాలామంది పాజిటివ్ పేషంట్లకు వైద్యపరమైన సేవలు అందించారు. ఆయన అందించిన వైద్యంతో వేలాది మంది కోలుకున్నారు. అయితే ఏప్రిల్ 24న డాక్టర్ భాస్కరరావుకు కరోనా సోకింది. వెంటనే హోమ్ ఐసోలేషన్‌లో ఉండి వైద్యం పొందారు. తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో భార్య డాక్టర్ భాగ్యలక్ష్మీ ఆయనను విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చేర్చారు. ఇక్కడ 10 రోజుల పాటు వైద్యం అందించినా పరిస్థితి మారకపోవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదా హాస్పిటల్, తరువాత గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తులు మార్చాల్సిందేనని వైద్యులు చెప్పారు.
భాస్కరరావు కుటుంబం ఉన్నదంతా.. ఆసుపత్రులకే ఖర్చు చేసింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. శస్త్రచికిత్సకు రూ.కోటిన్నర నుంచి కోటి 75లక్షల దాకా ఖర్చవుతుందని తెలుసుకుని.. కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. మరోవైపు భాస్కరరావుకి వెంటిలేటర్‌పై చికిత్స అందుతోంది. అంత సొమ్ము చెల్లించి వైద్యం చేయించే పరిస్థితులో ఆ కుటుంబం లేదు. అయితే ఈ విషయం తెలిసిన.. ప్రజలు.. తమ డాక్టర్.. ఆరోగ్యంగా తిరిగిరావాలనుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కారంచేడు గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. పైసా పైసా పోగేసి.. 20 లక్షల రూపాయలు సమకూర్చారు. దాతల నుంచి మరో 26 లక్షల రూపాయలు వచ్చాయి. అయినా డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు.
ఈ విషయంపై భాస్కర్‌రావు కుటుంబసభ్యులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించారు. మంత్రి ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ భాస్కర్‌రావు పరిస్థితి గురించి విన్న వెంటనే సీఎం జగన్ ఆయనకు అయ్యే వైద్య ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని భరోసానిచ్చారు. వెంటనే చికిత్స ప్రారంభించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తక్షణం అవసరాలకు కోటి రూపాయలు చెల్లించాలని, అవసరమైతే మరో రూ.50 లక్షలు కూడా చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులతో చెప్పారు.
కరోనా కష్ట సమయంలో ధైర్యంగా ప్రజలకు సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఎప్పుడూ అండగా ఉంటానని పలు సందర్భాల్లో ప్రకటించిన ముఖ్యమంత్రి అండగా ఉండటం హర్షణీయం. మరోవైపు ప్రజలు కూడా తమకు సేవ చేసిన డాక్టర్ ఎలాగైనా బతికించుకోవాలని చందాలు వేసుకుని డబ్బులు పంపించడం అభినందనీయం. ఈ ఘటనతో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రభుత్వమే.. కాదు.. ప్రజలూ తోడుగా ఉన్నట్టు స్పష్టమైంది. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో ఒక భరోసాను నింపినట్టైంది.
మా బాధ్యత మరింత పెరిగింది
ప్రమాదకరమైన వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు చేస్తున్న నిరంతర పోరాటానికి సీఎం జగన్ అండగా నిలవడం గొప్ప విషయమని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిడకాల శ్యాంసుందర్ చెప్పారు. ప్రాణాపాయంలో ఉన్న ప్రభుత్వ వైద్యుడిని ఆదుకునేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేసేందుకు వెంటనే నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సీఎం తీసుకున్న ఈ చొరవ మొత్తం వైద్యరంగంలో పనిచేస్తున్న మా అందరి బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Anandaiah Medicine: 'ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప సహకారం లేదు'