YCP sarpanches and leaders selling properties: నన్ను నమ్ముకో-ఉన్నది అమ్ముకో.. వైసీపీ సర్పంచ్‌లు, చోటామోటా నేతల ప్రస్తుత పరిస్థితి ఇదే. పార్టీ మనది.. ప్రభుత్వం మనది అనే ఉత్సాహంతో.. అప్పులు తెచ్చి మరీ ప్రభుత్వ పనులు చేయించారు. ఏళ్లుగా బిల్లులు మంజూరుగాక.. ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. బకాయిలు దాదాపు 520 కోట్ల రుపాయల వరకూ పేరుకుపోగా.. బిల్లులో జగనన్నా అంటూ బాధితులు బోరుమంటున్నారు.
షేక్ మహ్మద్ రసూల్ ప్రకాశం జిల్లా చినకంభం ప్రస్తుత సర్పంచి. వైసీపీ మద్దతుతోనే ఎన్నికయ్యారు. రసూల్ కోడలు హబీబా.. గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌గా పని చేశారు. రెండు దఫాలుగా.. సర్పంచ్ పదవిలో ఉన్న రసూల్ కుటుంబం.. ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకుంది. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదని ఉన్న ఆస్తులను అమ్మేశారు రసూల్.
రసూల్ కుటుంబం కూలీనాలీ చేస్తే గానీ రోజు గడవని పరిస్థితి. రసూల్ కుమారుడు బాషా కంభంలోనే టీకొట్టు నడుపుతున్నారు. కూలి చేసి పొట్టపోసుకుంటున్నామని కన్నీటిపర్యంతం అవుతున్నారు రసూల్ భార్య,పిల్లలు.
మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట సర్పంచ్ భాస్కరరావుదీ ఇదే పరిస్థితి. ఈయనా వైసీపీ మద్దతుదారే. ఈయనా ఉత్సాహంగా.. ప్రభుత్వ పనులు చేసి.. ఇప్పుడు ఉసూరుమంటున్నారు.
రసూల్, భాస్కర్‌రావే కాదు. గ్రామాల్లో సచివాలయాలు.. రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు నిర్మించిన చాలా మంది వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు చోటా మోటా నేతలదీ ఇదే పరిస్థితి. పూర్తైన భవనాలూ ఠీవీగా ఉన్నాయి. ఓపెనింగ్ చేసిన నేతలూ.. దర్జాగా ఉన్నారు. కానీ, నిర్మాణనికి డబ్బు ఖర్చుపెట్టిన వైసీపీ నేతలే.. బిల్లులో జగనన్నా అంటూ అలమటిస్తున్నారు.
లోగడలో మా కోడలు హబీబా గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌గా పనిచేశారు. అప్పుడు చేసిన పనులకు మూడు సంవత్సరాల క్రితం బిల్లులు వస్తే అసలు, వడ్డీ కలిపి అన్ని అప్పులు తీర్చాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక.. వాటర్ ట్యాంక్ నడిపాము.. దానికి రూ. 20 లక్షలు, ఉప్పువాగుకు సంబంధించిన రూ.10 లక్షలు, జేజేమ్ వర్క్ సుమారు రూ. 30 లక్షలు, సీసీ రోడ్ల లోగడ రూ. 8 లక్షలు, వాటర్ షెడ్డు బిల్లులు రూ. 10 లక్షలు ఇలా మొత్తం నాకు రూ. 83 లక్షల బిల్లులు రావాలి.-రసూల్, చినకంభం సర్పంచ్
ప్రభుత్వ పనులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వైసీపీ నేతలు చాలా మంది కాంట్రాక్టు పనుల్లోకి దిగారు. ఉన్నదంతా పెట్టారు. కొందరైతే.. అప్పులు చేసి మరీ ఖర్చు చేశారు. పనులు పూర్తైనా బిల్లులు రావడం లేదు. దాదాపు 520 కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగులో ఉన్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వడ్డీల భారంతో.. అప్పులు పెద్ద కుప్పలవుతున్నాయంటూ వైసీపీ నేతలు ఆక్రోశిస్తున్నారు. బాధితుల్లో కొందరు ఉండబట్టలేక.. అధికారిక, అనధికారిక సమావేశాల్లో నిలదీస్తున్నారు. మరికొందరు నాయకులు, ఎమ్మెల్యేల చుట్టూ.. ప్రదక్షిణలు చేస్తున్నారు. బయటకు చెబితే అసలుకే మోసం వస్తుందని.. మింగలేక, కక్కలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నవారు. రుణదాతల ఒత్తిళ్లు తట్టుకోలేక ఉన్న ఆస్తులు అమ్మి, ముట్టజెప్తున్నారు.
ఇవీ చదవండి