ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ప్రజలకు సేవలందించేందుకు సైన్యం, సేవా బృందాలు తక్కువ వ్యవధిలో చేరుకోవాలి. ఎక్కడో విమానాశ్రయంలో దిగి ఆయా ప్రదేశాలకు దళాలు చేరుకోవడం ఆలస్యంతో కూడిన పని. ఈ సమస్యను అధిగమించేందుకు... అందుబాటులో ఉన్న జాతీయ రహదారులపైనే అత్యవసర ల్యాండింగ్ ప్యాడ్లు నిర్మించేందుకు కేంద్రం నిర్ణయించింది.
దేశంలో 13 ఎయిర్‌ప్యాడ్లకు కేంద్రం నిధులు విడుదల చేసింది. జాతీయ రహదారులపై 11, రాష్ట్ర రహదారులపై 2 ఎయిర్‌ప్యాడ్లు నిర్మించనున్నారు. జాతీయ రహదారిపై నిర్మించనున్న వాటిలో రెండింటిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ రెండూ ప్రకాశం జిల్లాలోనే నిర్మితమవుతున్నాయి. ఒక్కో ఎయిర్‌ప్యాడ్‌కు 83 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దీనికి సంబంధించిన సర్వే గత ఏడాదే పూర్తవ్వగా ప్రస్తుతం ప్రాథమిక పనులు ప్రారంభమయ్యాయి.
ప్రకాశం జిల్లాలో శింగరాయకొండ మండలం పరిధిలోని కనుమళ్ళ రోడ్డు నుంచి, కందుకూరు రోడ్డు అండర్ పాస్ వరకూ ఒక ఎయిర్ ప్యాడ్ నిర్మించనున్నారు. మార్టూరు మండలం కొరిశపాడు నుంచి రేణింగి వరకు రెండో ఎయిర్‌ప్యాడ్ నిర్మిస్తారు. ఒకో ఎయిర్‌ప్యాడ్ మూడున్నర కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు పొడవు, 60 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఒకేసారి 4 ఎయిర్ క్రాప్ట్స్ నిలిపేందుకు వీలుగా పార్కింగ్ స్లాట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఎయిర్‌ప్యాడ్లకు ఇరువైపులా గేట్లు నిర్మిస్తారు. నిరంతరం రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. ఎలాంటి వంపులు, అండర్‌వేలు, వంతెనలు, రైల్వే బ్రిడ్జిలు, హైటెన్షన్ విద్యుత్తు లైన్లు వంటివి లేకుండా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్ల వల్ల సాధారణ వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా రహదారికి ఇరువైపులా 4 లైన్ల రహదారి నిర్మించనున్నారు.