ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని పలు గ్రామాలు పాడి పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. పాల ఉత్పత్తి అధికంగా ఉండటంతో... దర్శి పట్టణంలో అనేక మినీ పాలకేంద్రాలు వెలిశాయి. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదించవచ్చన్న ఉద్దేశ్యంతో పలువురు అక్రమార్జనకు తెర లేపారు. నకిలీ పాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
నకిలీపాల తయారీ..
పాలపొడి, సల్ఫర్, యూరియా, పామాయిల్, కొబ్బరి వంటి పదార్థాలతో నకిలీ పాలను తయారు చేస్తున్నారు. వీటిని కలపడం వల్ల పాలు చిక్కగా ఉండటంతో పాటు వెన్న శాతం కూడా అధికంగా వస్తోంది. ఫలితంగా అధిక మొత్తంలో నకిలీ పాలు తయారు చేసి నేరుగా పాల శీతలీకరణ కేంద్రాలకు తరలిస్తున్నారు.
అధికారుల అలసత్వం..
నకిలీ పాల తయారీ గురించి అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ.. నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. నమూనాలను ల్యాబ్‌కు పంపి నివేదికలు అందజేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నకిలీ పాల తయారీదారుల నుంచి అధికారులు డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఫుడ్ సేఫ్టీ అధికారి నాగూర్ మీరాను సంప్రదించగా.. నకిలీ పాల తయారీదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా తమ దృష్టికి రాలేదని, విచారించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీచదవండి.