సహాయ ఇంజనీర్ పోస్టుల భర్తీ పోటీ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని అంగ్లంతోపాటు తెలుగులోనూ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. సహాయ ఇంజనీర్ పోస్టుల భర్తీకి 2021 అక్టోబర్ 7న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన డి.శివశంకరరెడ్డి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మరోవైపు జనరల్ స్టడీస్ , మెంటల్ ఎబిలిటీ పరీక్ష ప్రశ్నలు డిప్లొమా స్టాండర్స్‌కు అనుగుణంగా ఇవ్వాలని కోరారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. వివిధ ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్‌లో సహాయ ఇంజనీర్ పోస్టుల భర్తీకి గతంలో అంగ్లంతోపాటు తెలుగులోనూ ప్రశ్నాపత్రం ఉండేదని పిటిషనర్ తరఫున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపించారు. ప్రసుత్త నోటిఫికేషన్ ప్రకారం కేవలం ఆంగ్లంలోనే నిర్వహించేందుకు నిర్ణయించారన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. పూర్తి వివరాలు సమర్పించాలని సర్వీసెస్ విభాగానికి చెందిన ప్రభుత్వ న్యాయవాదికి సూచించారు. ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది పేరును కాజ్ లిస్ట్‌లో ముద్రించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను మే 6కు వాయిదా వేశారు.
ఇదీ చదవండి:మున్సిపల్ ఎన్నికల ట్రైబ్యునల్‌పై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం