Sarpanch Join TDP with Their Followers : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఆరాచక పాలనకు ముగింపు పలికేందుకు జనం సిద్ధంగా ఉన్నారని, దీనికి టీడీపీలో చేరికలే నిదర్శనమని పార్టీ కనిగిరి నియోజకవర్గ బాధ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి అన్నారు. గురువారం ప్రకాశం జిల్లా దొడ్డిచింతల గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎస్. తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దొడ్డిచింతల గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత సానికొమ్ము బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో 170 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి ఉగ్రనరసింహా రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
ప్రజాతీర్పు ముందు డబ్బు పనికి రాదు : ఈ సందర్భంగా ఉగ్రనరసింహా రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారనుందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఈసారి డబ్బుతో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజాతీర్పు ముందు డబ్బు పనికి రాదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన సర్పంచి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ తరుఫున పోటీ చేసి గెలిచినప్పటకీ.. నాలుగు సంవత్సరాలుగా తాను పంచాయతీ అభివృద్ధికి ఏమీ చేయలేకపోయానని, పంచాయతీలోని ప్రజలకు కానీ ఎటువంటి పనులు చేయలేకపోయానని, ప్రజలు తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని ఒమ్ము చేశానని.. తనను క్షమించమని కోరారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరిచారని, దానికి తోడు స్థానిక ఎమ్మెల్యే బుర్ర మధు సుదన్ కూడా నియోజకవర్గ అభివృద్ధి మరిచి తన స్వలాభం కోసమే పనిచేస్తున్నాడని ఆయన అన్నారు. అధికారం లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులు నియోజకవర్గంలో ప్రజల తరపున నిలబడి ప్రజల సంక్షేమం కొరకు చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరానని సర్పంచ్ బ్రహ్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ఆధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు మురహరి నరసయ్యతో పాటు మాజీ అధ్యక్షుడు రఘునాథకాశిరెడ్డి, వెలిగండ్ల టీడీపీ అధ్యక్షుడు వెంకటరెడ్డితో పాటు తమ్మినేని శ్రీనివాసరెడ్డి, దొడ్డా సుబ్బారెడ్డి, కోటపాటి రమేష్ రెడ్డి, నాజర్, శ్రీనివాసరెడ్డి, జిల్లా టీడీపీ నాయకులు దోసపాటి బ్రహ్మంగౌడ్, గాయం రామిరెడ్డి, చీకటి వెంకటసుబ్బయ్య, మహిళలు భారీగా పాల్గొన్నారు.
"వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచాను. అప్పటి నుంచి పంచాయతీలో అభివృద్ధి చేయలేకపోయాను. మా గ్రామంలో మా అనుచరులు, కార్యకర్తలు ఏకగ్రీవ తీర్మానంతో టీడీపీలో దాదాపు 170 కుంటుంబాలు జాయిన్ అయ్యాము. వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన నిధులలో రెండు వాటాలు అతనే మింగేస్తున్నాడు. కోటిన్నర పనుల చేశాము. కోర్టుకెళ్లి డబ్బులు తీసుకోవాల్సి వస్తోంది. ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదు."- బ్రహ్మారెడ్డి, దొడ్డిచింతల సర్పంచ్