నెల్లూరు జిల్లా కావలి శివారులోని జమ్ముళపాలెం వద్ద గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల కోసం 97 ఎకరాలు సేకరించింది. ఇప్పుడు అది నిరుపయోగంగా ఉంది. పేద ప్రజలకు భూపట్టాలు పంపిణీ చేయాలని సంకల్పించిన వైకాపా ప్రభుత్వం ఈ భూమి వినియోగించుకుంటే... రూపాయి ఖర్చు లేకుండా అర్హులకు కేటాయించొచ్చు. అయితే ఆ భూమిని కాదని పట్టణానికి మరోవైపున ముసునూరు వద్ద 112 ఎకరాలు కొనుగోలు చేసేందుకు గత నెల ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈ లోగా ఓ ప్రజాప్రతినిధి అనుచరులు ఆ భూమిలో 13 ఎకరాల్ని కొనుగోలు చేశారు. 12 మంది పేరుతో మొత్తం 13 ఎకరాలు జులై 1న రిజిస్ట్రేషన్లు జరిగాయి. రైతుల నుంచి ఎకరా భూమిని 12 లక్షల రూపాయల చొప్పున కొన్నారు. అయితే 13 ఎకరాల భూ యజమానులు మాత్రం ఎకరాకు 59 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై అధికారులు చర్చలు జరుపుతుండగానే.... ఆ భూమిని ప్రజాప్రతినిధుల అనచరులే కొని ప్రభుత్వానికి అధిక ధరకు అమ్మబోతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి.
టిడ్కో ఇళ్ల కోసం సేకరించిన 97 ఎకరాలు కావలి పురపాలిక అధీనంలోనే ఉన్నప్పటికీ... అది ఉదయగిరి నియోజకవర్గమని అభ్యంతరం చెబుతుండటం, ముసునూరు భూమికి ఎక్కువ మొత్తం ధర ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. ఈ భూసేకరణ అంశం అధికారులకూ ఇబ్బందిగా మారుతోంది. ఇక్కడ పనిచేసిన సబ్ కలెక్టర్ బదిలీపై వెళ్లటం, అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవో వెంటనే సెలవు పెట్టేయటానికి ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ శేషగిరిబాబు బదిలీకీ ఈ భూ వ్యవహారమే కారణమన్న ప్రచారం ఉంది. ప్రజాప్రతినిధి అనుచరులు కొన్న భూముల మ్యుటేషన్ కుదరదన్నందుకే... భూసేకరణలో కీలకంగా వ్యవహరించిన జిల్లా సంయుక్త కలెక్టర్ వినోద్‌కుమార్‌పై వారం క్రితం బదిలీపై వేటు పడిందన్న ప్రచారం సాగుతోంది. ప్రస్తుతానికి ఈ భూముల వ్యవహారంపై స్తబ్ధత ఉందని, కమిటీ చర్చించాలని ఇన్ఛార్జి ఆర్డీవో దాస్ తెలిపారు.
గత ప్రభుత్వం సేకరించిన భూమి ఉండగా ప్రజాధనం దుర్వినియోగం చేయటమెందుకని పలువురు కావలి వాసులు అభిప్రాయపడ్డారు. అవినీతి జరగకుండా పేదల ఇళ్లపట్టాల పంపిణీ జరగాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'ప్రభుత్వానికి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు'