నెల్లూరు పెన్నానదికి వరద ప్రవాహం పెరిగింది. జిల్లా అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. డీఈవోసీలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమును కలెక్టర్ ఏర్పాటు చేశారు. నీటి ప్రవాహం వల్ల ఇబ్బందులు ఎదురైతే 104, 1077 నంబర్లకు కాల్ చేయవచ్చునని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.
చేజర్ల మండలం పుల్లనీలపల్లి వద్ద పెన్నా నది ప్రవాహంలో 10 మంది చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఇద్దరు రైతులు వేరుశనగ సాగు చేస్తూ తమ భూముల వద్దే నివాసముంటున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం ఎనిమిది మంది కూలీకి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంటికి వచ్చేప్పుడు నీటి ప్రవాహం అధికమై నలుగురు పురుషులు, నలుగురు స్త్రీలతో పాటు ఇద్దరు చిన్నారులు నదిలో చిక్కుకున్నారు. ఈ ఘటన సమాచారాన్ని స్థానికులు తహసీల్దార్‌కు సమాచారం అందించారు. దీంతో తహసీల్దార్ బాధితులను గట్టుకు చేర్చేందుకు బోటును తెప్పించే ప్రయత్నంలో ఉన్నారు.
ఈ రోజు సోమశిల ప్రాజెక్టు నుంచి ఎక్కువ నీటిని విడుదల చేస్తున్నారు. అందువల్ల బుచ్చి మండలంలోని పెన్నానది ఒడ్డున గల మినగల్లు, జొన్నవాడ, శ్రీరంగ రాజపురం, దామర మడుగు, గ్రామాలలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. వీఆర్వో, వీఆర్ఏ , వాలంటీర్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పెన్నా నదిలో నుంచి వరద నీరు వెంకటేష్ పురంలోని ఇళ్లలోకి వచ్చేస్తోంది. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: ముంబయిపై ప్రతీకారం.. తొలి మ్యాచ్ చెన్నైదే