నెల్లూరు కోర్టు సాక్ష్యాల అపహరణ ఘటనపై ముఖ్యమంత్రి, వైకాపా ప్రభుత్వం కిమ్మనకుండా ఉండటంలో అర్థమేంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. మంత్రి కాకాణి ముద్దాయిగా ఉన్న కేసులో సాక్ష్యాలు చోరీ జరిగితే ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు. దొంగతనం ద్వారా లబ్ధిపొందే కాకాణి గోవర్థన్ రెడ్డిని ఇంతవరకు ఎందుకు విచారించలేదని పోలీసులను ప్రశ్నించారు. ఇది మూమ్మాటికీ న్యాయవ్యవస్థపై దాడి అన్న వర్ల... కుట్రలో పెద్దమనుషులను పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. చోరీ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా దర్యాప్తు చేయించి అసలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
కేసు నేపథ్యం ఏంటంటే..: నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఓ కోర్టులో దొంగలు పడ్డారు. కీలక కేసుకు సంబంధించిన పత్రాలు అపహరించారు. విషయాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్క్ స్థానిక చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 13వ తేదీ అర్ధరాత్రి కొందరు వ్యక్తులు చొరబడ్డారు. ఓ కీలక కేసులో పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువెళ్లారు. 14వ తేదీ (గురువారం) ఉదయం కోర్టుకొచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు దాన్ని పరిశీలించగా.. అందులో ఉండాల్సిన పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే విచారణ చేపట్టారు.
అపహరణకు గురైన పత్రాల్లో ఏ1గా మంత్రి కాకాణి : సర్వేపల్లి ఎమ్మెల్యే, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి 2017లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై విలేకర్ల సమావేశంలో పలు విమర్శలు చేశారు. వివిధ పత్రాలు చూపించి హవాలాకు పాల్పడ్డారని ఆరోపించారు. దానిపై సోమిరెడ్డి.. తప్పుడు పత్రాలు చూపించి తనపై బురద జల్లుతున్నారని కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పాటు మరికొందరిపై కేసు పెట్టారు. కాకాణిపై పరువునష్టం దావా దాఖలు చేేశారు. ఈ కేసు విచారణ 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. ఈ కేసులో ఏ2గా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణిమోహన్ (పాస్‌పోర్టు ప్రకారం) ఆ కేసులో నకిలీ పత్రాలు రూపొందించినట్లు గుర్తించారు.
ఇద్దరు నిందితులు అరెస్టు: నిర్మాణంలో ఉన్న కొత్త కోర్టు భవనం వద్ద ఇనుము దొంగతనానికి వెళ్లి.. అది కుదరకపోవడంతో ప్రస్తుత కోర్టులో చోరీ చేశారని నెల్లూరు ఎస్పీ సీహెచ్ విజయరావు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు.
ఇదీ చదవండి: ఆ చోరీతో నాకెలాంటి సంబంధం లేదు.. ఏ విచారణకైనా సిద్ధం: మంత్రి కాకాణి