నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పరిశ్రమలకు చెందిన విషపూరిత రసాయన వ్యర్ధాలను చెరువుల్లో, త్రాగునీటి బావుల్లో పడవేస్తుండటంతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొందరు స్వార్ధపరులు ఎక్కడ పడితే అక్కడ పరిశ్రమల నుంచి విషపూరిత రసాయన వ్యర్ధాలను బావుల్లో, చెరువుల్లో పడవేస్తున్నారు. పొలాల్లో త్రాగునీటి బావిలోని నీరు కలుషితం అవుతుంది.
తన వ్యవసాయ బావిలో రసాయన వ్యర్ధాలను తీసుకువచ్చి పడవేస్తున్నారని చిల్లకూరు మండలం కడివేడు గ్రామానికి చెందిన లోకేశ్ అనే రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఆ ప్రాంతమంతా దుర్గంధం వ్యాపించి పూర్తిగా నీరంతా కలుషితం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంటల సాగునీటి అవసరాలకు ఏర్పాటు చేసుకున్న బావిలో గుట్టుచప్పుడు కాకుండా విషపూరిత కెమికల్స్ పడవేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల రైతలు కోరుతున్నారు.
ఈ మేరకు చిల్లకూరు పోలీసులకు పిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. గతంలో కడివేడు చెరువులో ఇదేవిధంగా రసాయన వ్యర్ధాలు పడవేయడంతో కలుషితమైన నీటిని తాగి మూగజీవాలు మృత్యువాత పడ్డాయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
Family Suicide: ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి.. దంపతుల ఆత్మహత్య!