తెలంగాణ నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ ఫ్లైఓవర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా... అంబులెన్స్ డైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన వ్యాధిగ్రస్తుడిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన నందగోపాల్‌రెడ్డి(75)కి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో... అతని కుమారుడు కమలాకర్‌రెడ్డిని తోడుగా తీసుకుని అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు బయల్దేరారు.
వేగంగా వచ్చిన అంబులెన్స్ కొండ్రపోల్ ఫ్లైఓవర్ వద్ద... ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రికొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అంబులెన్స్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో... అతనిని గుంటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: వరద ఉద్ధృతితో భయం భయం.. జలదిగ్బంధంలోనే గ్రామాలు