నెల్లూరు జిల్లాలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది. తిరుపతి ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
గూడురులో పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు చక్రధర బాబు, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని కలెక్టర్ తెలిపారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించినా.. వాటిని వెంటనే మార్చి పోలింగ్‌కు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మందకొడిగా సాగుతున్న పోలింగ్ శాతం.. సాయంత్రానికి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: లైవ్ అప్డేట్స్: ఉదయం 11 గంటల వరకు 17.3 శాతం పోలింగ్ నమోదు
నాయుడుపేట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పోలింగ్ సరళిని డీఐజీ తివిక్రమార్క్ పరిశీలించారు. కరోనా నిబంధనలతో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటును వినియోగించుకుంటున్నారు. తెదేపా, వైకాపా నాయకుల మధ్య వెంకటాచలంలో స్వల్ప వివాదం జరిగింది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ఇరు పార్టీల నేతలను బయటకు పంపించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఓటువేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
వెంకటగిరిలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. పట్టణంలోని పాతకోట పోలింగ్ కేంద్రం వద్ద అధికార పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారనే సమాచారంతో టీడీపీ నేత, స్థానిక మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆరాతీశారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు. వెంకటాచలంలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం పరిశీలించారు. ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుని అడిషనల్ ఎస్పీ పలకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తిరుపతి ఉపఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పొదలకూరు మండలంలో తన సొంత గ్రామమైన తోడేరులో ఓటు వేశారు.
ఇదీచూడండి: