Arya Vaishyas meeting in Nellore : రాజకీయాలకతీతంగా ఆర్యవైశ్య మహాసభను నిర్వహించాల్సిన అవసరముందని ఆర్యవైశ్య నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ పిలుపునిచ్చారు. నెల్లూరులో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల ఆర్యవైశ్య నేతలు హాజరయ్యారు. ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో చర్చించి, మహాసభకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించారు. ఆర్యవైశ్య మహాసభకు పోటీ చేసే అధ్యక్ష, కార్యదర్శులు కచ్చితంగా తమ తమ రాజకీయ పార్టీల ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందని అంబికా కృష్ణ అన్నారు. సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆర్యవైశ్యులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో పర్యటించి ఆర్యవైశ్యులను సంఘటితం చేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్న ఆర్యవైశ్య మహాసభ ఆస్తుల సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.
దాడులపై స్పందించరే.. రాష్ట్రంలో 35 ప్రాంతాల్లో ఆర్యవైశ్యులపై దాడులు జరిగితే మహాసభ అధ్యక్షుడు అని చెప్పుకుని తిరుగుతున్న ముక్కాల ద్వారకనాథ్ ఎక్కడికి వెళ్లారని ఆర్యవైశ్య నేత డూండి రాజేశ్ ప్రశ్నించారు. మహాసభ నాయకులమని చెప్పుకునే వ్యక్తులు ఆర్యవైశ్యుల బైలాను గౌరవించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా పదవిలో ఉన్నవారు నెల్లూరు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి సంబంధించిన లెక్కలు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం పెడితే ఎవరూ వెళ్లొద్దని, అది రాజకీయ పార్టీ సమావేశమంటూ సందేశాలు పంపడం మంచి పద్ధతి కాదన్నారు. అడ్డదారిలో అధ్యక్షుడిగా ప్రకటించుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్న వారికి తగిన గుణపాఠం చెబుతామని ఆర్యవైశ్య నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. అధికారం ఉందని ఏదో చేయాలనుకుంటే ఎవరూ భయపడరని, ఆర్యవైశ్యులకు తాము అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. సమావేశంలో బీజేపీ ఆర్యవైశ్య నాయకులు మాట్లాడాలంటూ ఓ వ్యక్తి ప్రశ్నించడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది.
ఆర్యవైశ్య మహాసభ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. రాజకీయాలు, దౌర్జన్యాలు సహించేది లేదు. చేతిలో పవర్ ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ఇకపై ఆటలు సాగవు. - సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య నేత
ఆర్యవైశ్యులపై రాష్ట్రంలో 35చోట్లు దాడులు జరిగాయి. వారిలో ఆరుగురు నడిరోడ్డుపై హత్యకు గురయ్యారు. అందులో ముగ్గురు వైఎస్సార్సీపీ నాయకులే. అయినా.. అధ్యక్షుడు అని చెప్పుకొని తిరుగుతున్న నాయకులు ఎందుకు పట్టించుకోలేదు. - డూండి రాజేష్, ఆర్యవైశ్య నేత
అర్యవైశ్య మహాసభకు ఎన్నిక జరగాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో పాల్గొ నే అభ్యర్థి ఏ ఇతర పార్టీల్లోనూ సభ్యుడై ఉండొద్దు. ఒకవేళ సభ్యత్వం ఉంటే రాజీనామా చేసి పోటీలో ఉండాలి. ఈ విషయాన్ని పత్రికల్లోనూ బహిరంగంగా ప్రకటించాలి. - అంబికా కృష్ణ, ఆర్యవైశ్య నేత
ఇవీ చదవండి :