TDP National Secretary Lokesh face to face program with youth: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ కంపెనీలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతోందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక.. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా యువనేత నారా లోకేశ్.. ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం బొమ్మవరం క్యాంపు వద్ద ఈరోజు యువతతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 2024లో అధికారంలోకి వచ్చాక.. యువత కోసం ఏయే కార్యక్రమాలు చేయనున్నారో..? జాబ్ క్యాలెండర్‌ను ఎప్పుడెప్పుడూ విడుదల చేయనున్నారో..? యువగళం పాదయాత్ర ముఖ్య ఉద్దేశ్యమెంటో..? యువతకు లోకేశ్ తెలియజేశారు.
యువతతో లోకేశ్ ముఖాముఖి కార్యక్రమం.. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో 127రోజులకు చేరుకుంది. నేటి పాదయాత్రను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆయన ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా యువనేత లోకేశ్ మధ్నాహ్నం 2 గంటలకు బొమ్మవరంలో యువతతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలను, జాబ్ క్యాలెండర్ విషయాలపై యువత సుదీర్ఘంగా మాట్లాడారు. యువత ప్రతి సమస్యను ఓపిగ్గా విన్న లోకేశ్.. అధికారంలోకి వచ్చాక యువత కోసం ఏయే కార్యక్రమాలు చేయనున్నారో వెల్లడించారు.
20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. యువనేత నారా లోకేశ్ మాట్లాడుతూ.. ''జగన్ పాలనలో జాబ్ కాలెండర్ విడుదల కాలేదు. ఒక్క పరిశ్రమ రాలేదు. రాష్ట్రంలోని ఐటీ కంపెనీలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతుంది. జగన్ పాలనలో విదేశీ విద్యా పథకం రద్దు చేశారు. అందుకే యువతలో ఒక లక్ష్యం తీసుకురావడానికే నేను ఈ యువగళం పాదయాత్ర మొదలుపెట్టాను. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభవృద్ధి చేశాము. ఎకో సిస్టం ఏర్పాటు చేస్తే ప్రభుత్వాలు మారిన అభివృద్ధి ఎక్కడికి పోదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, పోలీస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను దారుణంగా మోసం చేసింది. టీడీపీ అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో భర్తీ చేస్తాం'' అని ఆయన అన్నారు.
విదేశీ విద్యను మళ్లీ తీసుకొస్తాం.. అంతేకాకుండా, 175 నియోజకవర్గాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని నారా లోకేశ్ యువతకు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్యను మళ్లీ తీసుకు వస్తామన్నారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న గంజాయిపై యుద్ధం ప్రకటిస్తామన్న ఆయన.. గంజాయినీ విక్రయించే వ్యక్తి ఏ పార్టీ వారైనా అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయించి.. జైలుకు పంపిస్తామన్నారు. ఇక, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విధి, విధానాలను చూసి పెట్టుబడులు పెట్టే వాళ్లు వెనక్కి వెళ్ళిపోయారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
''జిల్లాల విభజన సరిగా జరగలేదు. పార్లమెంట్ నియమాల ప్రకారం జిల్లాల విభజన జరగాలి. కానీ, రాష్ట్రంలో రాజకీయ అవసరాలకు అనుగుణంగా జిల్లాల విభజన చేశారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అశాస్త్రీయంగా చేసిన ఈ జిల్లాల విభజనను కరెక్ట్ చేసి, హెడ్ క్వార్టర్స్‌ను ఫిక్స్ చేస్తాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ రావాలి, మెడికల్ కాలేజీ రావాలి, యునివర్సిటీలు రావాలి. ఇవన్నీ బాధ్యతులు ప్రభుత్వాలపైనా ఉన్నాయి.''- నారా లోకేశ్, టీడీపీ జాతీయ కార్యదర్శి