ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చే జలజీవన్ మిషన్.. రెండేళ్ల కిందట నెల్లూరు జిల్లాకు మంజూరైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. రెండేళ్లలో కుళాయిల ఏర్పాటు పూర్తి చేయాలని ప్రభుత్వం భావించగా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. మూడు నుంచి నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని.. గ్రామీణ నీటిసరఫరా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మంత్రి నోట:
ఇంటింటికి తాగునీటి కుళాయి పథకాన్ని 2020- 2022లోగా పూర్తి చేస్తాం. - పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అధికారుల మాట:
ఇప్పట్లో ఇది సాధ్యమయ్యేలా లేదు. మరో మూడు, నాలుగేళ్లు పట్టే అవకాశముంది. - జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారులు
ఇదీ పరిస్థితి..
మంత్రి చెప్పిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో ఎక్కడా పనులు జరగడం లేదు. జిల్లా అధికారుల్లో చొరవ పెరిగి పనులు వేగవంతం చేసి ప్రజలకు తాగునీటి కుళాయిలు అందిస్తారేమో అనుకుంటే.. ఈ పథకం ససేమిరా ముందుకు కదలనంటోంది.
నిధుల మళ్లింపు:
జిల్లాలోని 950 గ్రామాల్లో (కొన్ని మున్సిపాలిటీల్లో కలిపిన గ్రామాలతోపాటు) ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు. నాబార్డు, ఇతర పథకాల నుంచి కొంత మొత్తాన్ని ఈ పనులకు కేటాయించి.. పనులకు శ్రీకారం చుట్టారు. ఇవి నత్తనడకన సాగుతుండగా.. దాదాపు మూడు నెలల నుంచి స్తబ్ధుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన హామీ ప్రకారం.. రెండేళ్లలోనే పనులు పూర్తి కావాల్సి ఉంది. 2.88 లక్షల నివాసాలకు కుళాయిలు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. మొదటి ఏడాది 12,165 మాత్రమే బిగించారు. అంటే పథకంలో సాధించిన ప్రగతి 9.87 శాతం మాత్రమే. ఇదే తరహాలో పనులు జరిగితే 2020- 2022లోగా ఈ పథకం పూర్తికాదని తెలుస్తోంది. నిధులు పూర్తిస్థాయిలో రాకపోవడం ప్రధాన కారణం కాగా.. టెండర్ల ప్రక్రియ నేటికీ పూర్తికాకపోవడం మరో కారణం. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు, కరోనా ప్రభావం ఈ పనులకు అడ్డంకులుగా మారాయి.

లక్ష్యం పూర్తిచేసేలా చర్యలు:
కరోనా, ఇతర కారణాలతో ఇంటింటి కుళాయి పథకం పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. మొదటి విడత నిధులు విడుదలయ్యాయి. టెండర్లు కూడా త్వరగా పూర్తి చేస్తాం. అనుకున్న లక్ష్యాన్ని అధిగమించేలా చర్యలు చేపడతాం. - ఆర్.శ్రీనివాస్‌కుమార్, జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ

నిధుల పరిస్థితి ఇలా..
అంచనా : | రూ.730.84 కోట్లు |
1-ఫేజ్ విడుదలైన నిధులు : | రూ.211.61 కోట్లు |
తొలి ఏడాది ఏర్పాటైన కుళాయిలు : | 12,165 |
ఇదీ చదవండి: