నెల్లూరు అర్బన్‌లోని కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటవీ భూములను ఆనుకుని ఈ పాఠశాలను నిర్మించారు. సుమారు 300మంది విద్యార్ధులు చదువుతుండగా..ఒకే గదిలో రెండు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతమున్న భవనాలు విద్యార్థులకు సరిపోక ఇంకా స్థలం చాలక ఆరుబయట ఉన్న చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. బడి 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో విద్యార్థులు నడిచి వెళ్లాలంటే కష్టమౌవుతోంది.
పాఠశాలకు వెళ్లాలంటే భయమే..
బస్సు సౌకర్యం అందుబాటులో లేదని అందువల్ల ఆటోలను ఆశ్రయించక తప్పట్లేదని విద్యార్థులు చెబుతున్నారు. దీనికోసం నెలకు సుమారు రూ. 400లకు పైగా ఖర్చు పెట్టాల్సివస్తుందని వాపోతున్నారు. కొన్నిసార్లు ఆటోలు దొరకక సమయానికి హాజరుకాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జనసంచారం కూడా లేకపోవడంతో భయంగా ఉంటుందని విద్యార్థులు వాపోయారు. ప్రస్తుతం 12 తరగతి గదులు కావాల్సిఉండగా, 6 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆరుబయట తరగతుల నిర్వహణ కష్టంగా మారిందని..సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
మరికొన్ని గదులను నిర్మించండి.
ఇప్పటికే శంకుస్థాపన చేసిన కొన్ని భవనాలకు అదనంగా మరో 6 గదులను నిర్మించడంతో పాటు.. బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే మరింత సౌలభ్యంగా ఉంటుందని విద్యార్థులు కోరుతున్నారు.