ISRO Successfully Launch PSLV- C52: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి52 ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి దీన్ని చేపట్టారు. 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఈ ఉదయం 5.59 గంటలకు వాహకనౌక ఆర్‌ఐశాట్-1, ఐఎన్‌ఎస్-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. 18.31 నిమిషాల తర్వాత ఈ మూడు ఉపగ్రహాలను రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రకటించారు. శాస్త్రవేత్తల కృషి ఫలించిందన్నారు. వారికి అభినందనలు తెలిపారు.
2022లో ఇదే తొలి ప్రయోగం..
ఇస్రోకు 2022లో ఇదే మొదటి ప్రయోగం. అంతేకాకుండా ఇస్రో అధిపతిగా ఇటీవల నియామకమైన డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలో చేపట్టిన తొలి ప్రయోగం ఇది.
కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలు ఇవే..
ఆర్‌ఐశాట్-1: ఈ ఉపగ్రహం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. దీని కాలపరిమితి పదేళ్లు. రేయింబవళ్లు అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేలా రూపొందించారు. ఉపగ్రహంలో అధిక డేటా నిర్వహణ వ్యవస్థలు, అధిక నిల్వ పరికరాలు ఉన్నాయి. వ్యవసాయం, అటవీ, నీటి వనరుల నిర్వహణ కోసం విలువైన సమాచారం కనుగొనేందుకు ఈ ఉపగ్రహం ఇమేజింగ్ డేటా ఉపయోగపడనుంది. దీని బరువు 1710 కిలోలు.
ఐఎన్‌ఎస్-2టీడీ: భారత్, భూటాన్ కలిసి రూపొందించిన ఈ ఉపగ్రహ జీవితకాలం ఆరు నెలలు. భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం రూపొందించారు. దీని బరువు 17.5 కిలోలు.
ఇన్‌స్పైర్‌శాట్-1: విశ్వవిద్యాలయాల విద్యార్థులు తయారుచేసిన ఈ ఉపగ్రహం బరువు 8.1 కిలోలు. జీవితకాలం ఏడాది. తక్కువ భూకక్ష్యలో ఉండే ఈ ఉపగ్రహంలో భూమి అయానోస్పియర్ అధ్యయనం నిమిత్తం కాంపాక్ట్ అయానోస్పియర్ ప్రోబ్ అమర్చి ఉంటుంది.
ఇదీ చదవండి: pslv C-52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి52...