Damaged Bridge In Nellore: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది నెల్లూరులోని వెంకటేశ్వరపురం వద్ద బ్రిడ్జి. నెల్లూరు నుంచి ఒంగోలు, విజయవాడ వెళ్లే జాతీయ రహదారిని, ఇటు ముంబయి జాతీయ రహదారిని కలిపే ప్రధాన వంతెన గుంతలు ఏర్పడి.. దానిపై ఇనుప చువ్వలు తేలాయి. రోడ్జుపై పడిన గుంతలు దాదాపు అడుగులోతుగా ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. పెన్నా నదిపై రెండు జాతీయ రహదారుల్ని కలిపే అతి ప్రధాన వంతెన.. ఏడాదిగా మరమ్మతులకు నోచుకోలేకపోతుంది. అన్ని రకాల పన్నులు కడుతున్నా ప్రభుత్వం రోడ్లను బాగు చేయడం లేదని వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"రాత్రి సమయంలో వెళ్తే బ్రిడ్జిపై తేలిన ఇనుప చువ్వలు పొరపాటున టైరుకు తగిలి ఎగిరితే పొట్టలో, శరీరంలో గుచ్చుకునే ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. రోడ్లు బాగా లేవు. సుమారు అడుగులోతు గుంతలు ఏర్పడ్డాయి."- నెల్లూరు వాసి
"రోడ్డు పూర్తిగా గుంతల మయంగా ఉంది. దానివల్ల ట్రాఫిక్ ఆగుతోంది. పాడైన రోడ్ల వల్ల వాహనాలకు ప్రమాదం.. అలాగే బ్రిడ్జిపై తేలిన చువ్వలు వాహనం రన్నింగ్లో ఉన్నప్పుడు టైరుకు తగిలితే పంక్షర్ అయి పడిపోయే ప్రమాదం ఉంది."- నెల్లూరు వాసి
రెండు మూడు అడుగుల లోతులో వంతెనపై కాంక్రీట్ కొట్టుకుపోయింది. ఒక గుంతలో ఇనుప చువ్వలు బయటపడ్డాయి. వంతెన చివరి భాగంలో జాయింట్లు దెబ్బతిని వాహనాలు గుంతలోనుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. నిత్యం ప్రజా ప్రతినిధులు తిరిగే ప్రధాన వంతెన దెబ్బతిన్న ప్రాంతాన్ని బాగుచేయడానికి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. వంతెనపై వీది దీపాలు లేక రాత్రి ప్రమాదాలకు గురికావాల్సివస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వీలైనంత త్వరగా వంతెనకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: