People are Getting Sick in Nellore District: నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలకు కుళాయిల ద్వారా కలుషిత నీటిని తాగు నీరుగా సరఫరా చేయడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని కాగితాల్లో, వేదికలపైన చెబుతున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా వసతులు సమకూర్చడంలో విఫలమవుతోంది. వాస్తవ పరిస్ధితి చూస్తే ప్రజలకు రక్షిత నీరు అందడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్వచ్ఛమైన నీరు కుళాయిల ద్వారా అందక, ఆయా ప్రాంతాల్లో నేటికీ శుద్ధజలం పేరుతో ప్రజలు నకిలీ మినరల్ వాటర్ క్యాన్లు కొంటున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా (Nellore District)లో కలుషిత నీటిని తాగి వందలాది మంది ప్రజలు వాంతులు, విరోచనాలతో ఆసుపత్రుల్లో చేరారు. కొన్నిమరణాలు కూడా సంభవించినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.
నెల్లూరు కార్పోరేషన్, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి పట్టణాల్లో కుళాయిలకు కలుషిత నీరు సరఫరా అవుతుందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. నీరు రంగు మారినాా... అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పలు చోట్ల ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నా... అధికారులు చీమ కుట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయా ప్రాంతాల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. కలుషితమైన నీటిని తాగడంతో ప్రాణాలకు తెచ్చుకుంటున్నామని కాలనీల్లో ప్రజలు ఆరోపిస్తున్నారు. మురుగుకాలువ (Drainage) ల్లో మంచినీటి కుళాయిలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. లీకేజీలతో పాటుగా, తుప్పుపట్టిన పైప్ లైన్ల వల్ల తాగునీరు దుర్వాసన వస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.
ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన జిల్లా అధికారులు... ప్రజలకు రక్షిత నీటిని అందించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. ప్రజా ప్రతినిధులు వార్డులకు వెళ్లితే ప్రజలు అడిగే ప్రధాన సమస్య... తాగునీరు కలుషితం అవుతుందని చెబుతున్నారు. కమిషనర్లు కూడా ఈ సమస్యను పరిష్కరించడం లేదు. మురుగు కాలువల్లో మంచినీటి పైప్ లైన్లు ఉంటున్నాయి. తెలుగుదేశం పాలనలో ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంట్లును సరిగా వినియోగించలేక పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రూ.500కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించారు. పనులు పూర్తిచేసినా పైప్ లైన్లు, కొళాయిలు సరిగా వేయనందున నాలుగేళ్లుగా ప్రజలు తుప్పుపట్టిన దుర్వాసలను వచ్చే నీటిని తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకుని కోట్లాది రూపాయల మినరల్ ప్లాంట్ల వ్యాపారం జిల్లాలో జరుగుతుంది.
అధికారులు వాటిని కనీసం పరిశీలించడం లేదు. నాసిరకం నీరు, శుభ్రం చేయని క్యాన్లు బహిరంగంగా అమ్ముతున్నా కార్పొరేషన్ అధికారులు పరిశీలించడంలేదు... ఇప్పటికైనా నెల్లూరు నగరం, ఇతర పట్టణాల్లో అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా మంచినీటిని సరఫరా చేయాల్సి ఉంది. అసంపూర్తిగా ఉన్న శుద్ధ జలప్లాంట్ లను పూర్తి చేయాలి. లేకుంటే అతిసారం జిల్లాలో పెరుగుతుందని ప్రజలు అంటున్నారు.