రాష్ట్రంలో ఉల్లిఘాటు ఎంతకూ తగ్గడం లేదు. ప్రాంతంతో నిమిత్తం లేకుండా... ఉల్లి కొరత ఊపిరాడనివ్వడం లేదు. ధరల మంట భరించలేక రాయితీ ఉల్లి దక్కించుకునేందు జనం అవస్థలు పడుతున్నారు. వణికించే చలిలో... వేకువజామున 5 గంటల నుంచే రైతుబజార్ల వద్ద బారులు తీరుతున్నారు. అల్పాహారం కోసం వెళ్తే తిరిగి లైన్లోకి రానిస్తారో, లేదో అన్న ఆందోళనతో.. చాలామంది టీ, కాఫీలతోనే సరిపెట్టుకుంటున్నారు. వరుసలో ఓపిగ్గా నిలుచుంటున్నారు.
కావలిలో కిలోమీటరుకు పైగా ర్యాలీ
కావలిలోని రైతు బజార్‌లో అయితే రాయితీ ఉల్లి కోసం ప్రజలు కిలోమీటరు పైగా వర్షంలోనే బారులు తీరారు. తోపులాట జరగడంతో... బందోబస్తు మధ్య పంపిణీ చేయాల్సి వచ్చింది. తమవంతు వచ్చేసరికి నిల్వ అయిపోయి... కొందరు నిరాశగా వెనుదిరిగారు. రాయితీ ఉల్లిని కొందరు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి : ఐదేళ్లలో ఏపీకి 7వేల 361 కోట్ల విదేశీ రుణం