నెల్లూరు జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతోంది. జిల్లాలోని పలు పట్టణాలలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. పలు ప్రాంతాలలో జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు నగరంతో పాటు కావలి, గూడూరు, నాయుడుపేట, తడ వరకు పట్టణాల్లో వ్యాపార సంస్థలను మూసివేశారు. మెడికల్, నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే పొదలకూరు రోడ్డు, జీటీ రోడ్డు, మినీబైపాస్ రోడ్లు ప్రశాంతంగా కనిపించాయి.
బారికేడ్లతో వాహనాల రాకపోకల నియంత్రణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని వాణిజ్య సముదాయాలను పలువురు స్వచ్ఛందంగా మూసివేశారు. జిల్లాలో దాదాపు 800 ఆర్టీసీ బస్సులు డీపోలకే పరిమితమయ్యాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదన్న ప్రభుత్వ సూచనలతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆర్టీసీ, వీఆర్సీ, ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు.
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు
నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు గూడూరులోని రైతు బజార్, పెద్ద కూరగాయల మార్కెట్లను సందర్శించి తనిఖీలు చేశారు. నిర్ణీత ధరల కంటే ఎక్కువ రేట్లకు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే దుకాణాలు సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ప్లకార్డులు పట్టుకుని అవగాహన ర్యాలీ
కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరుతూ ఉదయగిరిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించినందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.