Old woman is fight for justice in Nellore district: నెల్లూరు జిల్లా చేజెర్ల పోలీస్ స్టేషన్ వద్ద న్యాయం కోసం వర్షంలో నిరసనకు దిగిన ఈమె పేరు బిల్లుపాటి లక్ష్మమ్మ. తన గుడిసెను వైసీపీ నాయకులు కూల్చివేశారని.. 12మంది తనపై దాడి చేశారంటూ ఈ నెల 18న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 5 రోజులు గడిచినా న్యాయం జరగలేదంటూ.. వర్షంలో తడుస్తూనే బుధవారం 3 గంటల పాటు పోలీస్ స్టేషన్ ఎదుట నిలబడి నిరసన తెలిపారు. కానీ ఆమె గోడును ఎవరూ వినలేదు. పట్టించుకున్న పాపాన పోలేదు.
గృహనిర్మాణ పథకం కింద 40 ఏళ్ల క్రితమే.. బిల్లుపాడు ఎస్సీ కాలనీలో లక్ష్మమ్మకు ఇంటి స్థలం కేటాయించారు. అక్కడే గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వైద్యం కోసం ఊరు విడిచి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన స్థానిక వైసీపీ నాయకులు.. అధికారుల సాయంతో వృద్ధురాలికి చెందిన 3 సెంట్ల స్థలాన్ని బిల్లుపాటి రాజేశ్వరి అనే మరో మహిళకు రాయించేశారు. వైద్యం చేయించుకుని తిరిగొచ్చిన లక్ష్మమ్మ.. తమ స్థలాన్ని వేరొకరికి ఎలా ఇస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. స్థలం ఖాళీ చేయన్నందుకు వైసీపీ నాయకులు తనపై దాడి చేసి, గుడిసెను ధ్వంసం చేశారని లక్ష్మమ్మ వాపోయారు.
"నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు. ఆసుపత్రికి వెళ్లి వచ్చేసరికి నాకు ఉన్న ఒక్క ఆధారం కూడా కూల్చేశారు. తినడానికి తిండిలేదు. నాకు ఎవరూ లేరు. గత నాలుగు రోజుల నుంచి నిరసన చేస్తున్న అయ్యో పాపం అని ఎవరూ దయ తలచలేదు. నాకు దగ్గర ఆప్తులు లేరు. నా ప్రాణం పోయిన ఇక్కడి నుంచి కదలను. నా స్థలాన్ని నాకు ఇచ్చేంత వరకు నేను పోరాటం ఆపను. నా తరఫున పోరాడటానికి ఎవరూ లేరు. దయచేసి నాయుకులు దయతలచి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను"-బిల్లుపాటి లక్ష్మమ్మ
ఘటన జరిగిన రోజే ఫిర్యాదు చేసినా స్పందించలేదంటూ.. బుధవారం పోలీస్‌స్టేషన్ ముందు లక్ష్మమ్మ నిరసనకు దిగారు. తనపై దాడికి పాల్పడ్డ 12మందిని అరెస్టు చేసే వరకు కదిలేది లేదంటూ పట్టుబట్టారు. అయినా పోలీసుల మనసు కరగలేదు. ఆమెకు న్యాయం జరగలేదు. అస్వస్థతకు గురైన లక్ష్మమ్మ.. ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని..తిరిగి ఇంటికొచ్చి.. పడగొట్టిన ఇంటి వద్దే తన నిరసన కొనసాగిస్తోంది. తనకు ఇంటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
ఇవీ చదవండి: