ఆసరా లేని ఒంటరి వృద్ధులు పింఛను మంజూరు కాక దుర్భర జీవనం సాగిస్తున్నారు. కుటుంబం సభ్యులను కోల్పోయి పేదరికంతో దినదిన గండంగా కాలం గడుపుతున్నారు. పక్షవాతంతో కాళ్లు , చేతులు పని చేయక నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి ఎంతో మంది వృద్ధులకు ఆధార్ కార్డులు లేక పింఛన్లు పొందలేకపోతున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అలాంటి వృద్ధుల దీన గాథ..
పైపులైనే పడక గది...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట లోతువానిగుంట వద్ద మేకల మణి అనే వృద్ధుడు కొన్ని నెలలుగా తాగునీటి పైపులైన్లలో జీవనం సాగిస్తున్నాడు. ఓ వైపు కాళ్లు, చేతులు పని చేయని శరీరం.. మరో వైపు చలి తీవ్రత , దోమలు ధాటికి వృద్ధాప్యంలో నరకయాతన అనుభవిస్తున్నాడు. ఇతని పరిస్థితి గమనించిన స్థానికులు చెక్కకు బేరింగులు అమర్చి ఇచ్చారు. దానిపై కూర్చొని చేతులతో తోసుకుని పోతూ... భిక్షాటన చేస్తున్నాడు.
యాభై ఏళ్ల నుంచి అద్దె ఇంట్లో ఒంటరిగా ఉన్న మణికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు మంజూరు కాలేదు. అవి లేకపోవడంతో పింఛన్ రాలేదు. అద్దె చెల్లించలేక ఇంటిని ఖాళీ చేసి రోడ్డున పడ్డాడు. ప్రస్తుతం బేరింగుల బండి సహయంతో... తిరుగుతూ భిక్షాటన చేస్తున్నాడు. అధికారుల చుట్టూ తిరిగినప్పటికి ఫలితం లేదని ఆవేదన చెందుతున్నాడు.
ఒంటరిగా బతుకు పోరాటం..
నాయుడుపేటలోని అగ్రహారపేట వద్ద నివాసముంటున్న ఇందుకూరు బీకయ్య పక్షవాతంతో నడవలేడు. ఏడాది క్రితం భార్య పక్షవాతంతో మృతి చెందింది. పిల్లలు లేకపోతే ఒక అమ్మాయిని దత్తత తీసుకుని పెంచి పెళ్లి చేశాడు. ప్రస్తుతం కుర్చీ సాయంతో ఇళ్ల వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తూ... కడుపు నింపుకుంటున్నాడు. పక్షవాతానికి మందులు తెచ్చుకునేందుకు నగదు లేక తిప్పలు పడుతున్నాడు. ఈయన పింఛన్ కు అవసమైన పత్రాలు ఇచ్చినా ఇంకా మంజూరు చేయలేదు.
ఇలా బతుకు బండిని ఈడుస్తూ...ఎంతో మంది వృద్ధులు భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం తమకు పింఛను అందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.