Village Eviction Dispute Of 4 Families Solved: ఓ వైపు సాంకేతికతతో దేశం పరుగులు పెడుతుంటే.. మరోవైపు గ్రామాల్లో మాత్రం కులాలు, మతాలు అంటూ ఆ ఊరి పెద్దలు అనాగరిక చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. తప్పు చేశారనే అనుమానంతో ఎటువంటి విచారణలు జరపకుండానే ఊరి కట్టుబాట్లు అంటూ అమాయకులను గ్రామబహిష్కరణలు చేస్తున్నారు. ఇలాంటి అమానుష ఘటనలు దేశంలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంతెందుకు ఓ పార్టీకి మద్దతు ఇచ్చిన గ్రామ బహిష్కరణకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నెల్లూరులో వెలుగు చూసింది.
ప్రపంచం ఎన్నో విషయాల్లో అభివృద్ధి చెందుతున్న.. ఇంకా కొన్ని కొన్ని మారుమూల గ్రామాల్లో వివక్షలు, గ్రామ బహిష్కరణలు, గ్రామ పెద్దల అధికారం కనిపిస్తుండటం బాధాకరం. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం టీవీ కండ్రిగలో సభ్యసమాజమే తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. ఓ చిన్న గొడవ కారణంగా నాలుగు కుటుంబాలను గ్రామస్థులు బహిష్కరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్ని గమనించిన అధికారులు ఆ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించారు. ఆ వివాదం పై రెండు వర్గాల వారితో చర్చలు జరిపి.. సామరస్యంగా కలిసి జీవించాలని అధికారులు వారికి సూచించారు.
"టీవీ కండ్రిగకు వచ్చి.. ఇరు వర్గాల పెద్దలతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాము. గ్రామాల్లో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఉండాలని నేను, ఎమ్మార్వో సూచించాం. ఇరువర్గాలను సమన్వయం చేసి గ్రామబహిష్కరణను రద్దు చేశాం"-రామకృష్ణారెడ్డి, సీఐ
"గతంలో జరిగిన చిన్న వివాదం కారణంగా 4కుటుంబాలు గ్రామబహిష్కరణకు గురైన విషయాన్ని తెలుసుకోని గ్రామస్థాయి అధికారులందరం వచ్చి దీనిని పరిష్కరించాం. ఇటువంటివి చట్టానికి విరుద్ధం కాబట్టి ఇటువంటి వాటికి పాల్పడవద్దని గ్రామస్థులకు సూచించాం"-సుబ్బయ్య, తహశీల్దార్
అసలేం జరిగింది: జిల్లాలోని టీవీ కండ్రిగలో శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో డీజే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఆ వివాదానికి 4 కుటుంబాలే కారణమంటూ సహాయ నిరాకరణ ద్వారా వారిని గ్రామ పెద్దలు ఊరి నుంచి బహిష్కరించారు. తాగడానికి నీరు, కిరాణా సరుకులు, మందులు ఇవ్వొద్దని గ్రామంలో హుకుం జారీ చేశారు. సోషల్మీడియాలో వైరల్ అవుతున్న విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలోనే నేడు గ్రామానికి వచ్చి ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించారు. అయితే గ్రామ బహిష్కరణకు గురైన ఆ నాలుగు కుటుంబాలు జనసేన పార్టీకి మద్దతుదారులని సమాచారం.
ఇవీ చదవండి: