NON PAYMENT SALARY: నెల్లూరు సర్వజన వైద్యశాలలో 400మంది ఒప్పంద కార్మికులు పని చేస్తున్నారు. వెయ్యి పడకలు ఉన్న ఆ ఆసుపత్రిలో.. సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులూ విధులు నిర్వహిస్తున్నారు. హాస్పిటల్ భద్రత, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు రోగులకు ఇబ్బంది లేకుండా సేవలందిస్తున్నారు. అయితే మూడు నెలలుగా వేతనాలు అందడం లేదని వీరంతా ఆందోళన చెందుతున్నారు. జీతాల చెల్లింపుల్లో అధికారులు జాప్యం చేస్తున్నారని వాపోతున్నారు.
చేసేదేమీ లేక.. అధిక వడ్డీకి అప్పు తెచ్చుకుని కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. కరోనా సమయంలో సైతం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తే.. అలాంటి పరిస్థితుల్లోనూ మూడు నెలల జీతాన్ని నిలిపివేసినట్లు కార్మికులు తెలిపారు. నేటికీ ఆ బకాయిలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి వేతనాలు అందక.. కార్మికులు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విధులకు రావాల్సి ఉండటంతో రవాణా ఛార్జీలు మరింత భారంగా మారాయని చెబుతున్నారు.
జీతాలు సమయానికి రాకపోవడంతో అప్పు ఇచ్చిన వారికి కనపడకుంటా తిరగాల్సిన దుస్థితి తలెత్తిందని కార్మికులు వాపోతున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, పిల్లలకు పాఠశాల ఫీజులు, కుటుంబ పోషణ మరింత భారమయ్యాయని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం మాత్రం లేదని ఒప్పంద కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన ఆరు నెలల బకాయిలను చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
"చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతూ.. బయట పది రూపాయల చొప్పున వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నాము. వాటితోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ప్రతి నెలా మాకు సక్రమంగా జీతాలు పడకపోవటంతో అప్పు ఇచ్చినవారికి కనబడకుండా తిరిగే దుస్థితి ఏర్పడింది." - అరీఫ్, భద్రతా సిబ్బంది
"జనవరి నెల నుంచి మాకు జీతాలు పడాలి. దీనివల్ల కుటుంబపోషణ చాలా కష్టతరంగా మారింది. ఇక్కడికి వచ్చి విధులు నిర్వర్తించేందుకు ఛార్జీలకు కూడా మా దగ్గర డబ్బులు లేవు. దీంతో బయట అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నాము. సక్రమంగా జీతాలు పడకపోవటంతో ఇలా అప్పులు తెచ్చుకుంటూ.. ఇక్కడికి వచ్చి విధులు నిర్వర్తిస్తున్నాను." - శ్రావణి, పారిశుద్ధ్య కార్మికురాలు
"మూడు నెలల నుంచి జీతాలు రావకపోవటం వల్ల ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది. నా భర్త హార్ట్ పేషెంట్. ఆయనకు మందులు తీసుకుని రావటానికి బయట అప్పులు తెచ్చుకుంటున్నాము." - సుమతి, పారిశుద్ధ్య కార్మికురాలు
ఇవీ చదవండి: